అక్కడే మేము ఫెయిల్... మహిళా బిల్లుపై మోడీ
తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకి సభ ఆమోదం తీసుకోవడంలో విఫలం అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించారు.;
తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకి సభ ఆమోదం తీసుకోవడంలో విఫలం అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించారు. అయితే తాము ఎక్కడ ఫెయిల్ అయింది కూడా ఆయన జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో వివరించారు. ఒక విధంగా మోడీ మన్ కీ బాత్ గా సాగిన ఈ ప్రసంగంలో ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ ని తొలి ముద్దాయి గా అభివర్ణించారు. కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలసి కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయం చేసిందని మోడీ గట్టిగా విమర్శించారు.
రాజకీయాల వల్లనే :
కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నారీ శక్తి వందన అధినియమ్ సవరణకు సంబంధించిన చట్టాన్ని లోక్ సభలో ఆమోదింపజేయడంలో ప్రభుత్వం తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ విఫలమైందని ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకు గానూ తల్లులందరికీ, సోదరీమణులందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని మోడీ ప్రకటించడం విశేల్షం. కొంతమందికి కొన్ని పార్టీలకు రాజకీయాలే సర్వస్వం అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయని మోడీ అన్నారు. దాని పర్యవసానాలను మహిళా సాధికారత, జాతీయ ప్రయోజనాలు రెండూ భరించాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
ఓడితే సంబరాలా :
దేశంలో మహిళల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఒక కీలకమైన చట్టం ఓడిపోయినప్పుడు కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హక్కులను హరించివేస్తూ బల్లలు చరచడం తనకు తీవ్రమైన బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. విపక్షాల చర్యల వల్ల మహిళల గౌరవానికి, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని మోడీ నిందించారు
డీలిమిటేషన్ లో న్యాయం :
తమ ప్రభుత్వం డీలిమిటేషన్ లోనూ న్యాయం చేసింది అని ఆయన అన్నారు. అదే సమయంలో నారీ శక్తి వందన్ సవరణ ప్రస్తుత అవసరమని నొక్కి చెప్పారు. అయితే డీలిమిటేషన్ పేరుతో ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలలో సమానమైన ప్రాధాన్యత ఉండేలా చూశామని గుర్తు చేశారు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి రాష్ట్రానికి పార్లమెంటులో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం పెంచడం ద్వారా వాటి వాణిని బలోపేతం చేయడమే డీలిమిటేషన్ చట్టం లక్ష్యమని మోడీ చెప్పారు. అయితే తాము చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు.
పాపానికి శిక్ష :
ఇదే సమయంలో మోడీ విపక్షాలకు శాపనార్ధాలు కూడా పెట్టారు. పార్లమెంటులో నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించిన పార్టీలు మహిళా శక్తిని తేలికగా తీసుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు చేసిన పాపానికి వారు తప్పకుండా శిక్షించబడతారని ఆయన చెప్పారు. అంతకు ముందు తమిళనాడు ఎన్నికల సభలోనూ ఆయన విపక్షాల మీద నిప్పులు చెరిగారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వనందుకు ప్రతిపక్ష పార్టీలను నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు.
మహిళా వికాసం వద్దా :
కాంగ్రెస్ దేశంలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అని ఆయన ఫైర్ అయ్యారు సాధారణ మహిళలను పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లోకి ప్రవేశించేలా రాజకీయ సాధికారత కల్పించడం కాంగ్రెస్ మిత్ర పక్షాలకు ఇష్టం లేదని మోడీ అన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారు దానిని వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కుటుంబం కోసం కుటుంబం చేత కుటుంబం ద్వారా నడుస్తుందని మోడీ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు ఒక గేమ్ ఛేంజర్ అవుతాయని మోదీ జోస్యం చెప్పారు తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని మోడీ పేర్కొన్నారు. గత పదకొండేళ్ళలో కేంద్రం తమిళనాడుకు 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిందని మోడీ వెల్లడించారు.