మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు మిస్ ఇండియా

ఈ పోటీల్లో గెలుపొందిన విశ్వసుందరికి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 8 కోట్ల రూపాయలు) ప్రైజ్‌ మనీగా ఇస్తారని సమాచారం.;

Update: 2025-05-25 10:49 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా తుది అంకానికి చేరుకుంటున్నాయి. 72వ ఎడిషన్ అయిన ఈ అంతర్జాతీయ పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం తీవ్రంగా పోటీపడ్డారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన 'టాప్ మోడల్ ఛాలెంజ్' లో భారత అందాల తార నందిని గుప్తా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, నలుగురు ఖండాంతర విజేతలలో ఒకరిగా నిలిచారు. ఆమె విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

'టాప్ మోడల్ ఛాలెంజ్' పోటీల్లో యూర‌ప్ నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ట్, ఆఫ్రికా నుంచి మిస్ నమీబియా సెల్మా కమాన్య, అమెరికా అండ్‌ క‌రేబియ‌న్‌ నుంచి మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, ఆసియా అండ్‌ ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా విజేత‌లుగా నిలిచారు. ఈ న‌లుగురు విజేత‌లు నేరుగా గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా గ్రాండ్‌ ఫినాలే పోటీ జరగనుంది. ఈ ఫైనల్ రౌండ్‌లోనే ఈ ఏడాది విశ్వసుందరి ఎవరో తేలనుంది.

ఈ పోటీల్లో గెలుపొందిన విశ్వసుందరికి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 8 కోట్ల రూపాయలు) ప్రైజ్‌ మనీగా ఇస్తారని సమాచారం. అంతేకాకుండా, ప్రపంచ స్థాయి యాడ్స్, కార్పొరేట్ కంపెనీల యాడ్స్ రూపంలో భారీగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు.

ఈ అందాల పోటీల్లో ఒక అరుదైన, వివాదాస్పద ఘటన కూడా చోటు చేసుకుంది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ అందాల పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. పోటీల నుంచి తప్పుకున్న తర్వాత 'ది సన్‌' న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఒక కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మిల్లా మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తోసిపుచ్చింది. ఆమె ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News