సొంతింటి కల.. కలేనా?
ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి భారతీయుడి జీవిత లక్ష్యం ఓ చిన్న ఇంటిని కొనుక్కోవడం. కానీ ఇప్పుడు అది చాలా మందికి కలగానే మిగిలిపోతోంది.;
ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి భారతీయుడి జీవిత లక్ష్యం ఓ చిన్న ఇంటిని కొనుక్కోవడం. కానీ ఇప్పుడు అది చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. దేశంలో సుమారు 59 శాతం మంది భారతీయులు సొంతింటి కలను వదులుకున్నారని, ఇది వారి ఇష్టం వల్ల కాదని, అసమానంగా పెరుగుతున్న ఆస్తి ధరలు, మూసుకుపోయిన అవకాశాలు కారణమని చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ ఇటీవల సోషల్ మీడియా 'యాక్స్'లో చేసిన పోస్ట్ ఈ విషాద వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.
- పెరిగిన ధరలు.. స్థిరమైన ఆదాయం:
ఆస్తి ధరలు ఆకాశాన్నంటుతుంటే సగటు ఉద్యోగి ఆదాయం నత్తనడకన సాగుతోంది. 2018లో టాప్ నగరాల్లో చదరపు అడుగు రేటు సగటున రూ. 5,500 ఉండగా, 2023 నాటికి ఇది రూ. 11,000కి పెరిగింది, అంటే రెట్టింపు వృద్ధి. అదే సమయంలో సగటు ఉద్యోగి జీతం 2019లో సంవత్సరానికి రూ. 1.35 లక్షలు ఉండగా, 2024 నాటికి కేవలం రూ. 1.80 లక్షలకే పెరిగింది.. అంటే 33 శాతం మాత్రమే వృద్ధి. ఇంటి ధరల పెరుగుదలతో పోలిస్తే ఈ ఆదాయ వృద్ధి చాలా తక్కువగా ఉండటంతో, సొంతింటి కల కేవలం కలగానే మిగిలిపోతోంది.
-వాస్తవికతను విస్మరించిన గృహ రుణ గణన
నితిన్ కౌశిక్ '5-20-40' నియమాన్ని ప్రస్తావిస్తూ గృహ రుణాల లెక్కలు ఇప్పుడు పనిచేయడం లేదని అంటున్నారు. ఏటా రూ. 10 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తికి రూ. 2 కోట్ల విలువైన ఇల్లు కొనడం అసాధ్యంగా మారిందని, ఇది ఒక అజ్ఞాత గడియారంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే, సంపాదనతో సంబంధం లేకుండా, సామాన్య మధ్యతరగతి వ్యక్తికి ఇల్లు కొనడం ఆర్థికంగా చాలా కష్టంగా మారింది.
-నల్లధనం ఆధారిత వ్యవస్థపై తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ రంగం నల్లధనం ఆధారంగా నడుస్తోందని కౌశిక్ తీవ్రంగా విమర్శించారు. రూ. 1 కోట్ల విలువైన ఆస్తికి సుమారు రూ. 32.5 లక్షల పన్ను విధించాల్సి ఉంటే, ప్రజలు ఆస్తిని తక్కువ రేటుతో రిజిస్టర్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదుగా చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పన్నుల ఎగవేత, ప్రభుత్వానికి ఆదాయ నష్టం జరగడంతో పాటు నల్లధనం ప్రభావం తీవ్రమవుతోందని తెలిపారు. ఈ పద్ధతి మధ్యతరగతి ప్రజలకు ఇంటి కొనుగోలును మరింత భారంగా మారుస్తుంది.
- ఇల్లు – నివాస అవసరం కాదా? పెట్టుబడి మాదిరేనా?
ఇల్లు ఇప్పుడు కేవలం నివాస స్థలం కాకుండా, సంపద నిల్వ చేసే వస్తువుగా మారిందని నితిన్ కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు ప్రీ-లాంచ్ ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని, వ్యవసాయ ఆదాయ పన్ను మినహాయింపు వంటి లోపాలను ఉపయోగించి, భూముల ఒప్పందాలను ట్యాక్స్ ఫ్రీగా తిప్పుతున్నారని ఆయన అన్నారు. ఇదంతా ఒక పద్ధతిగా మారి, మధ్యతరగతికి తలదాచుకునే ఇల్లు దూరంగా పోతోందని కౌశిక్ వాఖ్యానించారు.
-మధ్యతరగతికి ఇది ఆట కాదు
గుర్గావ్ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు అంతర్జాతీయ నగరాల కంటే ఎక్కువగా ఉండటం చూస్తే, ఇది సామాన్యుల కోసం రూపొందించిన వ్యవస్థ కాదని స్పష్టమవుతుంది. "ఈ వ్యవస్థ బాగా సంపాదించడానికి కాదు, బాగా మోసం చేయడానికి నేర్పుతుంది" అనే నితిన్ కౌశిక్ మాటలు సామాజికంగా తీవ్ర ప్రతిధ్వని కలిగిస్తున్నాయి. ఇంటికి ఊసే లేని తరం ఎదుగుతోందంటే, అది మన భవిష్యత్తుపై వేసిన ముద్రగా భావించాలని ఆయన హెచ్చరించారు.
ఇల్లు కొనాలన్న ఆశను వదులుకున్న 59 శాతం మంది మధ్యతరగతి భారతీయుల కథ ఇది. ఇది వ్యవస్థకు లోపమా? లేదా ధనవంతుల క్రీడలో మధ్యతరగతి బలయ్యిందా? ఎంతకాలం ఈ అసమానతల ఆట కొనసాగుతుంది? అన్నది సమాజం కలసికట్టుగా ఆలోచించాల్సిన సమయమిది. సొంతింటి కల నిజం కావాలంటే వ్యవస్థాగత సంస్కరణలు, నల్లధనం నియంత్రణ, మరియు ఆదాయ అసమానతలను తగ్గించే చర్యలు అత్యవసరం.