ప్రవహించే నీటి నుంచి విద్యుత్: 'వాటర్ వీల్' ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఏదీ?

భారతదేశం నదీనదాలకు నిలయం. దేశవ్యాప్తంగా వేల‌ సంఖ్యలో చిన్న‌ నదులు, కాలువలు, వేగంగా ప్రవహించే వాగులు- వంకలు ఉన్నాయి.;

Update: 2026-05-07 10:30 GMT

భారతదేశం నదీనదాలకు నిలయం. దేశవ్యాప్తంగా వేల‌ సంఖ్యలో చిన్న‌ నదులు, కాలువలు, వేగంగా ప్రవహించే వాగులు- వంకలు ఉన్నాయి. ప్రస్తుతం మనం భారీ జల విద్యుత్ కేంద్రాల ద్వారా అధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లోని స్థానిక అవసరాలను తీర్చడంలో ఇంకా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కొలంబియాకు చెందిన మార్క్ నెరింగ్ సృష్టించిన వినూత్న `మైక్రో హైడ్రో వాటర్ వీల్ ప్రాజెక్ట్` మన దేశానికి ఒక గొప్ప మార్గదర్శిగా కనిపిస్తోంది. ప్రవహించే నీటి శక్తిని ఒడిసి పట్టి ఇంటి అవసరాలకు వాడుకోవడం అనేది ఒక విప్లవాత్మక ఆలోచన.

మార్క్ నెరింగ్ రూపొందించిన ఈ వాటర్ వీల్ ప్రాజెక్ట్ విశిష్టత ఏమిటంటే... దీనికి భారీ డ్యామ్‌లు లేదా నీటి నిల్వ అవసరం లేదు. కేవలం ప్రవహించే నీటి ఒత్తిడితోనే ఈ చక్రం నిరంతరం తిరుగుతూ రోజుకు 24 గంటల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. సౌర విద్యుత్ రాత్రి వేళల్లో.. విండ్ టర్బైన్లు గాలి లేనప్పుడు ఆగిపోతాయి. కానీ ఈ వాటర్ వీల్ నదిలో ప్రవాహం ఉన్నంత కాలం స్థిరంగా విద్యుత్తును అందిస్తుంది. రోజుకు సుమారు 36 కిలోవాట్-అవర్ల (కేడ‌బ్ల్యూహెచ్) విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ యంత్రం.. ఒక సాధారణ ఇంటి అవసరాలకు మించి మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు పంపే స్థాయిని కలిగి ఉండటం ప‌రిశీలించ‌ద‌గిన‌ది.

భారతదేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా హిమాలయ ప్రాంతాల్లోని వేగవంతమైన నదులు.. దక్షిణాదిలోని గోదావరి, కృష్ణా వంటి నదుల కాలువలు ఈ తరహా మైక్రో హైడ్రో ప్రాజెక్టులకు అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఎండాకాలంలో కూడా నిరంతరం ప్రవహించే భారీ వాగుల చెంతన నివసించే గిరిజన ప్రాంతాలకు.. మారుమూల గ్రామాలకు ఇది వరప్రదంగా మారుతుంది. మార్క్ నెరింగ్ తన గ్యారేజీలోనే అల్యూమినియం వాటర్ వీల్‌ను తయారు చేసి ఆధునిక జనరేటర్లను అమర్చినట్లుగా మన దేశంలోని ఇంజనీరింగ్ నైపుణ్యంతో తక్కువ ఖర్చుతోనే స్థానికంగా ఇలాంటి యంత్రాలను రూపొందించుకోవచ్చు.

అయితే ఇటువంటి వినూత్న ప్రాజెక్టులు మన దేశంలో సక్సెస్ కావాలంటే ప్రభుత్వ సహకారం అత్యంత అవసరం. మార్క్ నెరింగ్ కెనడాలో ఎదుర్కొన్నట్లుగానే మన దేశంలో కూడా అనుమతుల ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఒక చిన్న వాటర్ వీల్‌ను కూడా భారీ డ్యామ్‌గా పరిగణించి పర్యావరణ అధ్యయనాలు కోరడం వల్ల సాధారణ వ్యక్తులు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి వెనకడుగు వేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. నీటి ప్రవాహ వేగం సెకనుకు కనీసం 3 మీటర్లు ఉండాలనే నిబంధనతో పాటు.. పర్యావరణానికి .. చేపల మనుగడకు ఇబ్బంది కలగకుండా ఉండే నిబంధనలను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ త‌ర‌హా విద్యుదుత్పాద‌న‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను కూడా అధ్య‌య‌నం చేయడం త‌ప్ప‌నిస‌రి.

హ‌ర్మూజ్ జ‌ల సంధి మూసివేత‌- ఆయిల్ క్రైసిస్ త‌ర్వాత ప్ర‌పంచ దేశాలు చాలా పాఠాల‌ను నేర్చుకున్నాయి. ముఖ్యంగా 150 కోట్ల జ‌నాభా ఉన్న‌ భార‌త‌దేశం ఆయిల్ ఆధారిత ఇంధ‌నాల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని స్ప‌ష్ఠ‌మైంది. ఈ దిశ‌గా ఇప్ప‌టికే చైనా వంటి అగ్ర దేశం స్వయం ఉత్పాద‌క ఇంధ‌న రంగాల‌పై దృష్టి సారించి ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించడంలో స‌ఫ‌ల‌మైంది. దీనిని భార‌త్ కూడా అనుస‌రించాల్సి ఉంటుంది. మన దేశంలో గంగా, కృష్ణ, గోదావరి వంటి 12 ప్రధాన నదులు, 46 మధ్యస్థ నదులు ఉండగా.. చిన్న నదులు వేల‌ల్లో ఉన్నాయి.

దిగుమ‌తి చేసుకునే ఇంధనాల వినియోగాన్ని తగ్గించి.. పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లుతున్న ఈ కాలంలో `వాటర్ వీల్` వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. విద్యుత్ సౌకర్యం లేని ఏజెన్సీల‌లోని మారుమూల ప్రాంతాలకు గ్రిడ్ విద్యుత్ తీసుకెళ్లడం కంటే అక్కడ ఉన్న సహజ వనరులను వాడుకుని స్థానికులే విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేలా రాయితీలు, సులభతరమైన అనుమతులు కల్పించాలి. మార్క్ నెరింగ్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలోని నదీ పరివాహక ప్రాంతాలు, నిరంత‌రం ప్ర‌వ‌హించే కాలువ‌లు, సెల‌యేళ్ల లో ఇటువంటి మైక్రో హైడ్రో ప్రాజెక్టులను ప్రోత్సహిస్తే గ్రీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం మరో ముందడుగు వేసినట్లవుతుంది.

Tags:    

Similar News