టీవీకే మీడియా.. భవిష్యత్తు కోసం దళపతి వ్యూహాం!
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ తన రాజకీయ భవిష్యత్తును మరింత ధృడంగా కొనసాగించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.;
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ తన రాజకీయ భవిష్యత్తును మరింత ధృడంగా కొనసాగించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో విజయవంతం అవ్వాలంటే మీడియా బలం కూడా ఉండాలని బలంగా నమ్ముతున్న దళపతి తన పార్టీ కోసం సొంత మీడియాను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సినీ గ్లామర్ తో తొలిసారే భారీ విజయం సొంతం చేసుకున్నా, ప్రత్యర్థుల మీడియా శక్తితో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే భావనతో విజయ్ సొంత మీడియా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఏదో ఒక మీడియా దన్నుగా నిలవడంతోనే ఆయా పార్టీలు పటిష్టంగా ఉన్నాయని, భవిష్యత్తులోనూ టీవీకే బలపడాలన్నా, ప్రత్యర్థులను ఎదుర్కోవాలన్నా మీడియా మద్దతు అవసరమని విజయ్ సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, తమిళ రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా ఎక్కువగా చెబుతారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి అక్కడ ప్రధానమైన రెండు చానళ్లు ప్రత్యక్షంగానే మద్దతుగా నిలుస్తాయని ప్రచారం ఉంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి చెందిన అగ్రశ్రేణి మీడియా డీఎంకే పార్టీ అధికారిక గొంతుగా చెబుతారు. అదేవిధంగా ఏఐడీఎంకే పార్టీకి కొన్ని చానళ్లు ఉన్నాయని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలకు అనుకూల మీడియా ఉందన్న ప్రచారం ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ కేంద్రంగా ఓ చానల్ ఉందని ప్రచారం ఉంది. అదే మీడియా గ్రూప్ ఎన్నికలకు ముందు కేరళం రాష్ట్రంలో మళయాల మీడియా రంగంలోకి అడుగు పెట్టిందని చర్చ కూడా జరుగుతోంది.
ఇలా తెలుగు, తమిళ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అన్నీ మీడియా దన్నుతోనే విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమ విజయాలను చెప్పుకోడానికి, ప్రతిపక్షాలు సంధించే అస్త్రాలను తిప్పికొట్టడానికి మీడియాను ఆయా పార్టీలు సమర్థంగా వినియోగించుకుంటున్నాయి. మీడియా అండదండలతోనే టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు తమ గళాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నాయని, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో తమ వ్యక్తిగత ఆకర్షణతోపాటు మీడియాలోనూ ఆదరణ ఉండాలని ప్రధాన పార్టీల అధినేతలు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విజయ్ కూడా అదే రకమైన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో మీడియా బలం లేకపోయినప్పటికీ సోషల్ మీడియా అండతో విజయ్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారని అంటున్నారు. అయితే భవిష్యత్తులో ఆయన పార్టీ మరింత బలంగా ఉండాలంటే సొంత మీడియా ఉండాలని, లేని పక్షంలో రాజకీయ ప్రత్యర్థులు తమ మీడియాను ఉపయోగించి విజయ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రమాదం ఉందని ఆయన సన్నిహితులు భయపడుతున్నారు. రాజకీయ వ్యూహాలతోపాటు మీడియా వార్ ను సైతం ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, సోషల్ మీడియాపైనే ఆధారపడితే కొన్నిసార్లు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోనే విజయ్ సొంతంగా మీడియా ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. అయితే ఇందుకోసం విజయ్ ఎంత సమయం తీసుకుంటారనేది తెలియడం లేదని అంటున్నారు. ప్రస్తుతం సీఎం పీఠం అందుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన విజయ్ కుర్చీలో కుదురుకున్నాక టీవీకే మీడియాపై తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.