బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెలవారీ ఖర్చులు.. రూ. 2.36 లక్షల లెక్క చూసి నెటిజన్లు షాక్!

గూగుల్ ఉద్యోగి అయిన @builtonfridays అనే యువకుడు తన మార్చి నెల ఖర్చులకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు.;

Update: 2026-05-07 09:39 GMT

బెంగళూరు అంటేనే ట్రాఫిక్.. ఐటీ కంపెనీలు.. భారీ జీతాలు గుర్తొస్తాయి. అయితే, జీతాలు ఎంత భారీగా ఉన్నా.. ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా ఒక గూగుల్ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్న వివరాలు అద్దం పడుతున్నాయి. ఒక ఎఫ్.ఏ.ఏ.ఎన్.జీ (ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్ తన నెలవారీ ఖర్చుల చిట్టాను బయటపెట్టడంతో ఆ అంకెలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో

గూగుల్ ఉద్యోగి అయిన @builtonfridays అనే యువకుడు తన మార్చి నెల ఖర్చులకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఆ నెలలో అతను ఏకంగా రూ. 2.36 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించాడు. "డబ్బు సంపాదించేందుకు మనం ఎంత కష్టపడతామో ఆ సంపాదించిన సొమ్ము ఎక్కడ ఖర్చవుతుందో అర్థం చేసుకోవడానికే మన జీవితంలో సగం సమయం పడుతోంది" అంటూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీశాయి.

ఖర్చుల వివరాలు ఇవీ

బెంగళూరు వంటి నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. తన నివాసానికి ప్రతి నెలా రూ. 40,000 అద్దె చెల్లిస్తున్నట్లు అతను తెలిపాడు. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల వంట చేసుకునే సమయం లేకపోవడంతో కేవలం బయటి ఆహారం కోసమే నెలకు రూ. 35,000 ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఇది సగటు మధ్యతరగతి వ్యక్తి నెల జీతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. బెంగళూరు ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి ఉబెర్, రాపిడో, నమ్మ యాత్రి వంటి సేవల కోసం రూ. 22,000 ఖర్చు చేశాడు.

బిజినెస్ ట్రిప్ అదనపు ఖర్చులు

మార్చి నెలలో మకావోకు కంపెనీ స్పాన్సర్ చేసిన బిజినెస్ ట్రిప్ వెళ్లినప్పటికీ, అక్కడ వ్యక్తిగత షాపింగ్, ఫుడ్ , ఇతర అదనపు ఖర్చుల కోసం తన జేబు నుండి రూ. 80,000 ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్ల కోసం రూ. 20,000, గ్రోసరీల కోసం రూ. 10,000, కరెంట్, నీరు, వైఫై బిల్లుల కోసం రూ. 5,000 వెచ్చించాడు. తన తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ. 20,000 పంపిస్తూ వినోదపరంగా సినిమాలు, కాన్సర్ట్లు కోసం రూ. 5,000 ఖర్చు చేశాడు.

నెటిజన్ల రియాక్షన్.. "ఇది మా వార్షిక ఆదాయం!"

ఈ ఖర్చుల జాబితా చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. "అతను నెలలో ఖర్చు చేసిన మొత్తం నా వార్షిక జీతం కంటే ఎక్కువ" అని ఒక యూజర్ కామెంట్ చేయగా "నేను లండన్‌లో ఉంటున్నాను, అక్కడ కూడా నా నెల ఖర్చులు ఇంత ఉండవు" అని మరొకరు రాసుకొచ్చారు. "రూ. 35 వేలు ఫుడ్ కోసం ఖర్చు చేసే బదులు, ఒక వంట మనిషిని పెట్టుకుంటే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా మిగులుతుంది" అని పలువురు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి విలాసవంతమైన ఖర్చులు తగ్గించుకుని, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.

మొత్తానికి బెంగళూరులో ఐటీ ఉద్యోగుల జీవనశైలి, పెరుగుతున్న జీవన వ్యయం పై ఈ వీడియో మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. సంపాదన పెరిగే కొద్దీ అవసరాల కంటే విలాసాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.




Tags:    

Similar News