మరణ శిక్షలు నిలిపేయాలా.. వద్దా అనేది మా ఇష్టం: భారత్
| మరణశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలన్న ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. శిక్షల నిర్ణయం ఆయా దేశాల సార్వభౌమాధికారం, న్యాయవ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఈ తీర్మానాన్ని భారత్‌తో పాటు మరో 32 దేశాలు వ్యతిరేకించగా, 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
దోషులకు మరణ శిక్ష విధించడం.. మానవతా సాయం అందించడం వంటి విషయాల్లో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఉరి, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. వీటికి భారత్ సైతం మద్దతు తెలుపుతోంది. దోషులకు మారేందుకు అవకాశం కల్పించడం, వారిలో పరివర్తన తీసుకురావడమే సరైన శిక్షలుగా కూడా పేర్కొంటోంది. అయితే.. తాజాగా అంతర్జాతీయ వేదికపై మాత్రం.. ఈ శిక్షల విధింపు, అమలు విషయంలో ప్రపంచ దేశాల దృక్కోణం నుంచి భారత్‌ను చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మరణశిక్షల అమలుపై ప్రపంచ వ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలని ఓ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే.. భారత్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ప్రపంచం మొత్తం ఒకే తరహా సివిల్ కోడ్‌ను అమలు చేయదని.. ఏదేశానికైనా ఆయా దేశాల సార్వభౌమాధికారం అనుసరించి.. శిక్షలు, నేరాలు భిన్నంగా ఉంటాయని తెలిపింది. భారత్‌లో ఉన్న చట్టాలు.. ఇతర దేశాల్లో లేవని.. అలానే ఇతర దేశాల్లో అనుసరించే కొన్ని చట్టాలను భారత్ కూడా పాటించదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో మరణ శిక్షలు విధింపు, అమలు అనేది పూర్తిగా భారత న్యాయ వ్యవస్థ, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. దీనిని ఏకీకృతం చేస్తూ.. తాత్కాలిక నిషేధం విధిస్తే.. దీనిని అడ్డు పెట్టుకుని ఉగ్రవాదులకు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించింది. సొంత న్యాయ వ్యవస్థను, నేరాలకు తగిన శిక్షలను నిర్ణయించుకునే సార్వభౌమ హక్కు ప్రతి దేశానికి ఉంటుందని, ఈ విషయంలో అంతర్జాతీయంగా ఎలాంటి ఏకాభిప్రాయం లేదని భారత్ స్పష్టం చేసింది.
33 దేశాలదీ భారత్ బాటే..
కాగా, ఈ ముసాయిదా తీర్మానం కోసం 133 దేశాలకు ఓటింగ్ పెట్టగా.. వీటిలో భారత్ సహా 33 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మరో 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా, పాకిస్థాన్ సహా పలు దేశాలు భారత్ వినిపించిన వాదనకు జై కొట్టడం గమనార్హం. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఇచ్చేలా ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. తమ దేశంలో అమలవుతున్న చట్టాలను ప్రశ్నించడం సాధ్యంకాదని పాక్ పేర్కొంది.