పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన! గవర్నర్ సంచలన నిర్ణయం?

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ తన పదవికి రాజీనామా చేయలేదు.;

Update: 2026-05-07 08:05 GMT

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ తన పదవికి రాజీనామా చేయలేదు. మే 5, 2026న కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో "నేను ఓడిపోలేదు, రాజీనామా చేసే ప్రసక్తే లేదు. రాజ్‌భవన్‌కు వెళ్లేది లేదు" అంటూ మమత ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరేది ఎలా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. మమత రాజీనామా చేయకపోతే, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఎలా చేస్తారన్న చర్చ నడుస్తోంది. అయితే దీనిపై రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ ఆర్.ఎన్.రవి సంప్రదింపులు జరుపుతున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు 7వ తేదీ (గురువారం)తో ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం కూడా ఆటోమెటిక్ గా రద్దు అవుతుందని అంటున్నారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాజీనామా చేసేందుకు అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇప్పటివరకు ఎదురుకాలేదు. దీంతో పశ్చిమబెంగాల్ గవర్నర్ రవి తీసుకోబోయే చర్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిజానికి ఎన్నికల్లో ఓడిపోతే ఎవరైనా సీఎం పదవికి వెంటనే రాజీనామా చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేత రెండోసారి గెలిచినా తాను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు రాజీనామా సమర్పిస్తారు. పాత అసెంబ్లీ రద్దు అయితే కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది. ఇదంతా ఇప్పటివరకు జరుగుతున్న ప్రక్రియ. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత కొత్త సీఎం బాధ్యతలు తీసుకునే వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరతారు.

అయితే మమత రాజీనామా ప్రసక్తే లేదని అంటుండటంతో కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే మమత రాజీనామా చేయకపోయినా ఆమె నేటితో మాజీ అవుతారని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి గడువు తీరిపోతున్నందున ఆ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా రద్దు అవుతుందని అంటున్నారు. దీంతో అసెంబ్లీతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ రవి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అంటే రాజీనామా చేయని మమతను డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా మమతను డిస్మిస్ చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అంటున్నారు.

మే 4న ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు వీలుగా రాజీనామాలు సమర్పించారు. కానీ, మమత ఇంతవరకు ఆ ఊసు ఎత్తకపోగా, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడంతో గవర్నర్ ప్రత్యామ్నాయ చర్యలు దిశగా ఆలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. మమతను ఆ పదవి నుంచి తొలగించి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో కొత్త ప్రభుత్వం 9వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేఎల్పీ సమావేశం కానుంది. తమ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు బీజేఎల్పీ నేత ఎవరు అన్నది బీజేపీ అధిష్టానం బయటపెట్టలేదు. ఈ ప్రక్రియలో ఏమైనా ఆలస్యం జరిగితే ఒకటి రెండు రోజులు తరువాత కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని అంటున్నారు. దీంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా గవర్నర్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెబుతున్నారు. మమత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడమా? లేక గవర్నర్ రవి కేర్ టేకర్ గా ప్రభుత్వ బాధ్యతలు తీసుకోవడమో జరగవచ్చునని అంటున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ సంప్రదిస్తున్నారని, ఈ రోజు సాయంత్రానికి ఈ విషయంపై క్లారిటీ రావొచ్చని అంటున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే తాత్కాలికంగా గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన విధించడానికే ఎక్కువ అవకావాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News