మెటా 'కంటెంట్ ఫాస్ట్ ట్రాక్' వ్యూహం : క్రియేటర్లకు కాసుల గాలం..

ఒకప్పుడు సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఫేస్‌బుక్ ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.;

Update: 2026-03-21 02:30 GMT

ఒకప్పుడు సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఫేస్‌బుక్ ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మారుతున్న కాలంతో పాటు యువత అభిరుచులు మారడం.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల జోరు పెరగడంతో ఫేస్‌బుక్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో యువతను మళ్లీ తనవైపు తిప్పుకునేందుకు మెటా సంస్థ “కంటెంట్ ఫెస్ట్ ట్రాక్‘ పేరుతో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది.

ఏంటి ఈ 'కంటెంట్ ఫాస్ట్ ట్రాక్'?

ప్రముఖ కంటెంట్ క్రియేటర్లను, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆకర్షించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. దీని కింద ఎంపిక చేసిన క్రియేటర్లకు నెలకు 3,000 డాలర్ల (సుమారు ₹2.5 లక్షలు) వరకు పారితోషికం చెల్లిస్తామని మెటా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా అమెరికా, కెనడా దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశాలు

ఇతర ప్లాట్‌ఫార్మ్‌లలో యూట్యూబ్, టిక్ టాక్ లో పాపులర్ అయిన క్రియేటర్లను ఫేస్‌బుక్‌లోకి ఆహ్వానించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. నిష్క్రియంగా ఉన్న పాత క్రియేటర్లను మళ్లీ యాక్టివ్ చేయనున్నారు. నెలవారీ లక్ష్యాల ఆధారంగా ఉదాహరణకు 15 రీల్స్ కు నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. అయితే ఈ ఆర్థిక మద్దతు కేవలం మూడు నెలల కాలానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

సవాళ్లు.. విమర్శలు

మెటా భారీ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ క్రియేటర్ల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫేస్‌బుక్ బ్రాండ్ ఇమేజ్. గత దశాబ్ద కాలంలో యువత ఫేస్‌బుక్‌ను కేవలం 'పెద్దల ప్లాట్‌ఫార్మ్'గా చూడటం మొదలుపెట్టారు. ప్రముఖ కంటెంట్ గ్రూప్ ‘సైడ్ మెన్’ మేనేజర్ జోర్డాన్ స్వార్జెన్‌బెర్గర్ అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్రియేటర్లు తమ కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో కేవలం 'రీ-పోస్ట్' చేస్తున్నారే తప్ప ప్రత్యేకంగా ఆ ప్లాట్‌ఫార్మ్ కోసం కంటెంట్ రూపొందించడం లేదు. దీనికి తోడు మెటా ఇస్తున్న పారితోషికంపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. "ఒక నెలకు 15 నాణ్యమైన రీల్స్ చేయాలంటే ఒక్కో వీడియోకు 200 డాలర్లు మాత్రమే పడుతుంది. ప్రొడక్షన్ ఖర్చులు, టీమ్ సాలరీలు, ఎడిటింగ్ వ్యయాలతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ " అని కొందరు క్రియేటర్లు పెదవి విరుస్తున్నారు.

యూజర్ ఎంగేజ్‌మెంట్ సంక్షోభం

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 3 బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నప్పటికీ, అందులో 'యాక్టివ్ ఎంగేజ్‌మెంట్' లైకులు, షేర్లు, కామెంట్లు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. యువత ఎక్కువగా విజువల్ కంటెంట్ , షార్ట్ వీడియోల కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లేదా ఎక్స్ వంటి వేదికలపై సమయం గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లో కంటెంట్ డిస్కవరీ అల్గారిథమ్ కూడా క్రియేటర్లకు తగినంత రీచ్ ఇవ్వడం లేదనే వాదన ఉంది.

మెటా ముందున్న సవాలు

టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం డబ్బులు ఇవ్వడం వల్ల ప్లాట్‌ఫార్మ్ రూపురేఖలు మారిపోవు. ఫేస్‌బుక్ తన అల్గారిథమ్‌ను మార్చడంతో పాటు, యువతకు నచ్చే కొత్త ఫీచర్లను తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే మూడు నెలల తర్వాత చెల్లింపులు ఆగిపోతే క్రియేటర్లు మళ్లీ వేరే ప్లాట్‌ఫార్మ్‌లకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

మొత్తానికి మెటా చేపట్టిన ఈ 'కంటెంట్ ఫాస్ట్ ట్రాక్' వ్యూహం ఫేస్‌బుక్‌కు పునర్జీవం పోస్తుందా లేక కేవలం తాత్కాలిక ప్రయత్నంగానే మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలంటే మెటా ఇంకా విప్లవాత్మకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News