రూ.13 వేల కోట్లకు పైగా మోసం... భారత్ కు పంపడానికి నో ప్రాబ్లమ్..!

ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం రాజకీయంగా ప్రేరేపించిందని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఛోక్సీ ఆరోపించారు.;

Update: 2025-10-22 10:43 GMT

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న సుమారు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన ఛోక్సీ, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతడికి సంబంధించి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఛోక్సీ ని భారత్‌ కు అప్పగించే విషయంపై బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను భారత్‌ కు అప్పగించడంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది.

అవును... దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని భారతదేశానికి అప్పగించడానికి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని.. అతనిపై ఉన్న అభియోగాలు దానికి సమర్థనీయమైనంత తీవ్రమైనవి అని బెల్జియంలోని ఒక కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. వాస్తవానికి మెహుల్‌ ఛోక్సీని భారత్‌ కు అప్పగించేందుకు ఇటీవల బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం రాజకీయంగా ప్రేరేపించిందని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఛోక్సీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా బెల్జియం యాంట్వెర్ప్‌ న్యాయస్థానం స్పందించింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తు చేస్తూ... అతని అప్పగింతను సమర్థించే తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది.

ఇదే సమయలో... భారత్‌ ఆదేశాల మేరకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్‌ చేశారంటూ చాలాకాలంగా ఛోక్సీ చేస్తున్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా ఛోక్సీ అప్పగింత అనంతరం అతడిని ఉంచే జైలుకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన వివరాలను బెల్జియం కోర్టు ప్రస్తావించింది.

ఇదే క్రమంలో... భారతదేశం ఉదహరించిన నేరాలు.. మోసం, ఫోర్జరీ, డాక్యుమెంట్ల తప్పుడు సమాచారం, అవినీతి అనేవి బెల్జియన్ చట్టం ప్రకారం కూడా నేరాలుగా పరిగణించబడతాయి. భారతదేశంలో నమోదైన కేసులు భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ, 201, 409, 420, 477ఏ, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కిందకు వస్తాయి.. ఇవన్నీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ జైలు శిక్షను కలిగి ఉంటాయని తెలిపింది.

భారత ప్రభుత్వం అందించిన వివరాలను ప్రస్తావిస్తూ.. ఛోక్సీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నంబర్ 12లో ఉంచుతామని కోర్టు పేర్కొంది.. ఇందులో 46 చదరపు మీటర్ల విస్తీర్ణం, రెండు సెల్‌ లు, ఒక ప్రైవేట్ టాయిలెట్ ఉన్నాయి. వైద్య అవసరాల కోసం లేదా కోర్టు హాజరు కోసం మాత్రమే చోక్సీని జైలు నుండి బయటకు తీసుకువెళతామని భారతదేశం గతంలో బెల్జియంకు హామీ ఇచ్చింది.

కాగా.. జనవరి 2, 2018న భారతదేశం నుండి పారిపోయిన 65 ఏళ్ల వజ్రాల వ్యాపారి ఛోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీ.ఎన్.బీ)ని రూ.13,850 కోట్లు మోసం చేశాడనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు గాలిస్తున్నాయి. అతని మేనల్లుడు నీరవ్ మోడీ కూడా ఈ మోసంలో అతనితో పాటు ఉన్నాడు!

Tags:    

Similar News