భారత్ లో 13వేల కోట్లు నొక్కి.. విదేశాల్లో అమ్మాయికి చిక్కి..!

అవును... భారత్ ను వదిలిపోయిన తర్వాత తనను హంగేరీకి చెందిన బార్బరా జబారియా అనే మహిళ ట్రాప్ చేసిందని ఆరోపించారు మొహుల్ ఛోక్సీ!;

Update: 2025-04-16 20:30 GMT

కుట్ర, మోసం, అవినీతి అభియోగాలు ఉన్న వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు అయిన మొహుల్ ఛోక్సీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ.13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఆంటిగ్వా-బార్బుడా కు పారిపోగా.. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, అతని మేనల్లుడు నీరవ్ మోడీ లండన్ లో ఆశ్రయం పొందారు.

ఈ క్రమంలో తాజాగా అతనిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. అతడికి సంబంధించిన పలు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఈ సమయంలో అతడికి సంబంధించి రోజుకో కొత్త కథ తెరపైకి వస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... తనను ఓ మహిళ మోసం చేసిందని.. నట్టేట ముంచేసిందని.. దీని వెనుక భారత్ ఉందని చెబుతూ కొత్త కథ మొదలుపెట్టాడు!

అవును... భారత్ ను వదిలిపోయిన తర్వాత తనను హంగేరీకి చెందిన బార్బరా జబారియా అనే మహిళ ట్రాప్ చేసిందని ఆరోపించారు మొహుల్ ఛోక్సీ! తనను అరెస్ట్ చేసే దిశగా భారత్ ఓ వ్యూహాన్ని రచించిందని.. అందులో ఈ బార్బరా అనే మహిళ కీలక భూమిక పోషించిందని చెబుతూ.. ఆమె తనకు ఎలా పరిచయం అయ్యింది, ఎలా స్నేహితురాలిగా మారింది చెప్పే ప్రయత్నం చేశారు!

ఇందులో భాగంగా... తొలుత తనవద్దకు తెలియని వ్యక్తిగా వచ్చిన బార్బరా.. అనంతరం క్లోజ్ ఫ్రెండ్ గా మారిందని, తనను డిన్నర్ లకు ఆహ్వానించే వరకూ తమ ఫ్రెండ్ షిప్ వెళ్లిందని.. ఈ క్రమంలోనే తనను కిడ్నాప్ చేసిన బార్బరా.. తనపై వలపుల వల విసిరిందని.. ఆ విధంగా తాను అరెస్ట్ అయ్యేలా చేసిందని.. దీని వెనుక తనను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్లాన్ దాగి ఉందని ఆరోపించారు!

అయితే... ఛోక్సీ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించింది. తాను హంగేరీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా తనతో పరిచయం పెంచుకునేందుకు ఛోక్సీ తన అసలు గుర్తింపును దాచి పెట్టారని.. ఆ విధంగా తనను అతడే మోసం చేశారని.. అతని కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు ఆమె వాపోయారు.

కాగా ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని అక్కడి ప్రభుత్వం ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023లో అతడు "ఎఫ్ రెసిడెక్సీ కార్డ్" పొందాడు. అయితే.. ఛోక్సీ అక్కడ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే బెల్జియంలోని ఓ ఆసుపత్రికి ఛోక్సీ వెళ్లగా.. అతడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఛోక్సీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన కారణంగానే అతడిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు వీల్ చైర్ కే పరిమితమైన పరిస్థితి అని తెలుస్తోంది! అతడిని త్వరలో భారత్ రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News