మధ్యవర్తిత్వం లేకనే ....సీజేఐ సంచలన వ్యాఖ్యలు

మధ్య వర్తిత్వం అంటే చిన్న మాట కాదు, పెద్ద బాధ్యత. ఒక వివాదం నాలుగు గోడల మధ్యనే సమసిపోయేలా చేసేది ఈ మధ్యవర్తిత్వం.;

Update: 2026-03-02 03:36 GMT

మధ్య వర్తిత్వం అంటే చిన్న మాట కాదు, పెద్ద బాధ్యత. ఒక వివాదం నాలుగు గోడల మధ్యనే సమసిపోయేలా చేసేది ఈ మధ్యవర్తిత్వం. బయటకు వెళ్తే అయ్యేది రచ్చ మాత్రమే. ముదిరితే గొడవలుగానే మారుతుంది. అలా కాకుండా భేదాలను ముందే తొలగించుకుంటే అంత కంటే గొప్ప తీర్పు వేరేది ఉండదు, ఇపుడు తలపండిన న్యాయమూర్తులు సైతం ఇదే చెబుతున్నారు. మధ్యవర్తిత్వంతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు.

సులువుగా అయ్యే కేసులు :

ఇదిలా ఉంటే ఏపీ పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం అనేది ఒక ముఖ్యమైన సాధనమని చెప్పుకొచ్చారు. సులువుగా మధ్యవర్తిత్వంతో అయ్యే కేసులు కూడా కోర్టుల్లో ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మధ్యవర్తులు క్లెయింట్ నమ్మకం పొందడం చాలా అవసరం అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరూ న్యాయస్ధానాలను న్యాయాన్ని నమ్ముతారని అందువల్ల మధ్యవర్తిత్వాన్ని కోర్టులు కచ్చితంగా అందరికీ తెలిసేలా చేయాలని ఆయన సూచించారు. 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం వల్ల దీనికి ఒక చట్టబద్ధత లభించిందని అన్నారు. దీని ద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీ తో సమానంగా అమలు చేయబడతాయని వివరించారు. వివాదంలో ఉన్న వ్యక్తులకు మధ్యవర్తిపై పూర్తి విశ్వాసం ఉండాలన్నారు.

శ్రీక్రిష్ణుడే దారి చూపాడు :

దీన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యత కలిగిన పద్ధతిగా చూడాలని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన ఆల్టర్నేటివ్ గా ఆయన చెప్పడం విశేషం. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని పురాతన కాలం నుంచే భారతదేశంలో వినియోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఒకసారి వెనక్కి వెళ్తే మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్ఏలోనే ఉందని స్పష్టం అవుతుందని అన్నారు. మధ్యవర్తిత్వానికి వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. శ్రీకృష్ణుడు పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నాన్ని మొదటి అధికారిక మధ్యవర్తిత్వంగా ఆయన ఉదహరించారు.

సరైన శిక్షణ అవసరం :

ఇక చూస్తే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం వల్ల న్యాయస్థానాల ద్వారా జరిగే మధ్యవర్తిత్వానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి సరైన శిక్షణ ఉండటం చాలా ముఖ్యం అని అన్నారు. కోర్టులలో కేసుల భారాన్ని తగ్గించడానికి, త్వరితగతిన స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఒక అద్భుతమైన మార్గమని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. మలేషియాలో మధ్యవర్తిత్వానికి దొరుకుతున్న ప్రోత్సాహాన్ని తాను స్వయంగా చూసానని ఆయన చెప్పారు. మధ్యవర్తిత్వం మన జీవితాలలో ప్రతి అంశంలోనూ ఉందని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. కమర్షియల్‌ సమస్యలు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయని చెప్పారు.

సక్సెస్ ఫుల్ ఫార్ములా :

ఇక జ్యుడీషియల్ సిస్టమ్ మీడియేషన్ ను అంతా కలిసి ప్రమోట్ చేయాలన్నారు. మీడియేషన్ ఇప్పుడు చాలా ఆమోదింప దగ్గ ప్రక్రియగా జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా దీనికి ఆదరణ పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీడియేషన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతం అయ్యిందన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు ఫలితమే అమరావతి అని అన్నారు. మీడియేషన్ను లీగల్, ప్రొఫెషనల్ కల్చర్ లో భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Tags:    

Similar News