తెలుగు రాష్ట్రాల్లో కార్నర్ అవుతున్న 'మీడియా'!
అన్ని వేళలా.. అందరినీ.. ఏ మీడియా కూడా సమర్థించలేదు. అలా చేయాలంటే.. ఆ నాయకులు, ఆ పార్టీలు సరైన దిశగా నడవాలి.. సమర్థవంతంగా వ్యవహరించాలి.;
అన్ని వేళలా.. అందరినీ.. ఏ మీడియా కూడా సమర్థించలేదు. అలా చేయాలంటే.. ఆ నాయకులు, ఆ పార్టీలు సరైన దిశగా నడవాలి.. సమర్థవంతంగా వ్యవహరించాలి. అయితే.. తాము ఏం చేసినా సమర్థించాలన్న ధోరణి, తాము ఏం మాట్లాడినా.. బాకాలూదాలన్న ధోరణి ఇటీవల కాలంలో పార్టీలు, నాయకుల్లో ప్రబలుతోంది. ఇదే మీడియాకు.. కొన్ని రాజకీయ పార్టీలకు మధ్య వివాదాలు రేపుతోంది. ఒక్క ఏపీనే కాదు.. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ వర్సెస్ ఆంధ్రజ్యోతి వివాదం ఇప్పుడు కాకరేపుతున్న విషయం తెలిసిందే.
కానీ.. ఒక్కసారి రెండు మాసాల కిందకు వెళ్తే.. తెలంగాణలో కేసీఆర్ కు చెందిన మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఇలానే విరుచుకుపడ్డారు. అయితే.. ఆయన పేరు చెప్పకపోయినా.. `జర్నలిస్టులు, జర్నలిజం`పైనిప్పులు చెరిగారు. ``తమ పేర్లు కూడా సరిగా రాయడం చేతగాని వారంతా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు.`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొన్ని పత్రికలు.. హద్దులు మీరుతున్నాయని ఆగ్రహించారు. ఇక, ఏపీలో 12 ఏళ్లుగా వైసీపీ వర్సెస్ మీడియా మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా.. ఈనాడు నాటి అధిపతి రామోజీరావును అరెస్టు చేయించే ప్రయత్నంచేశారు.
ఆంధ్రజ్యోతి ప్రసారాలను అడ్డుకున్నారన్న వాదన ఉంది. ఇలా.. మీడియా ఎప్పుడూ కార్నర్ అవుతూనే ఉంది. వాస్తవానికి `మీడియా కార్నర్`గా ఉండాల్సి ఉండగా.. మీడియానే కార్నర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే.. కొట్టిన చోట కొట్టకుండా కొట్టిస్తామని, తిప్పిన స్టేషన్‌కు తిప్పకుండా స్టేషన్ల చుట్టూ తిప్పుతామని చేసిన వ్యాఖ్యలు ఒక మీడియా అధిపతి(జగన్)గా ఆయనకు సరైనవేనా? అనేది ఆలోచన చేసుకోవాలి.
ఇక, మీడియా కూడా.. లక్ష్మణ రేఖలు మరిచిపోవడం ఒకింత దురదృష్టకరమే. పార్టీలు.. రాజకీయాలు.. నేతలు నిరంతరం ఒకరికొకరు విమర్శలుచేసుకోవడం కామన్ అయిపోయింది. నిజానికి మనదగ్గరకంటే కూడా.. ఉత్తరాదిలో ప్రత్యర్థులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇలాంటి విషయంలో `మీడియా తన పాత్రను` పోషించాలే తప్ప.. `తనే పాత్రను ధరించకూడదు` అనే కనీస నియమాన్ని విస్మరిస్తున్న దరిమిలా.. ఇప్పుడు విమర్శలు.. వివాదాల సుడుల్లో చిక్కుకోవాల్సి వస్తోంది. ``మీడియాకు లక్ష్మణ రేఖలు అవసరం.`` అని నాడు మీడియాపై నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జు వ్యాఖ్యలను నాడు తప్పుపట్టినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ వాస్తవికతను కళ్లకు కడుతున్నాయి.