నేటి నుంచే మేడారం మ‌హా జాత‌ర‌.. ఈ విష‌యాలు తెలుసా?

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కే కాదు.. ఆదివాసీలు జ‌రుపుకొనే అతి పెద్ద పండుగ‌.. మేడారం జాత‌ర‌.;

Update: 2026-01-28 13:19 GMT

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కే కాదు.. ఆదివాసీలు జ‌రుపుకొనే అతి పెద్ద పండుగ‌.. మేడారం జాత‌ర‌. దీనిని తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వం `రాష్ట్ర పండుగ‌`గా గుర్తించింది. అంతేకాదు.. భారీ ఎత్తున నిధులు కూడా ఇచ్చింది. రెండు మాసాల‌కు ముందే.. ఏర్పాట్లు చేయ‌డం ప్రారంభించారు. ఈ ఏర్పాట్లు కూడా.. భారీ ఎత్తున చేయ‌డం మ‌రో విశేషం. బుధ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ మ‌హా జాత‌ర క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేశారు. గ‌తానికి భిన్నంగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించారు. జాత‌ర‌కు వెళ్లేవారు.. వాటిని ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే!.

ఇవీ.. విశేషాలు..

+ రాష్ట్ర పండుగ‌గా గుర్తించిన ప్ర‌భుత్వం 250 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది.

+ ఈ ద‌ఫా 3 కోట్ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా. దానికి త‌గిన విధంగా ఏర్పాట్లు చేశారు.

+ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ‌తంలోనే గుర్తించింది.

+ కేటాయించిన 250 కోట్ల నిధుల్లో 50 కోట్ల రూపాయ‌లు కేంద్రం ఇస్తుంద‌ని అధికారులు తెలిపారు.

+ ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి మేడారం జాత‌ర నిర్వ‌హిస్తారు.

+ వ‌న దేవ‌తలుగా ఆదివాసీలు కొలుచుకునే సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీర‌నున్నారు.

+ ఈ జాత‌ర మొత్తం 4 రోజులు జ‌ర‌గ‌నుంది.

+ తెలంగాణ‌తోపాటు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, భక్తులు హాజ‌రు కానున్నారు.

+ ఈ ద‌ఫా సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేశారు.

+ ఏఐని వినియోగించి త‌ప్పిపోయిన చిన్నారులను గుర్తించ‌డంతోపాటు.. వృద్ధుల‌కు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఏంటీ జాత‌ర ప్ర‌త్యేక‌త‌?

మేడారం మ‌హా జాత‌ర‌.. వ‌న సంర‌క్ష‌ణ‌ను సూచిస్తుంది. వ‌నాల‌ను ప‌చ్చ‌గా కాపాడుకోవ‌డ‌మే.. ఈ జాత‌ర ల‌క్ష్యం. క‌న్నెప‌ల్లికి చెందిన సార‌ల‌మ్మ‌, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి ఆమె తండ్రి పగిడిద్ద రాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు వ‌న సంర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించారు. వీరిని ఒక చోట‌కు చేరుస్తారు. ఇక‌, వీరికి మ‌ద్ద‌తుగా సమ్మక్క కూడా వ‌న సంర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించింది. ఆమె కూడా ఈ గ‌ద్దెల‌పైకి చేరుతుంది. ఇలా న‌లుగురు క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకునే ఘ‌ట్ట‌మే.. జాత‌ర‌!. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకురావ‌డం విశేషం.

Tags:    

Similar News