వేలానికి గోల్డెన్ కమోడ్.. దీన్ని వాడుతారా..?
ఈ కమోడ్ తయారీకి 100 కిలోల బంగారం వినియోగించారట. ఇంతటి కమోడ్ కేవలం ప్రదర్శనకు మాత్రమే.;
ఈ సందర్భంగా వెనుకటి సామెత ఒకటి గుర్తుకు చేసుకోవాలి.. ‘బంగారు చెప్పులైనా కాళ్లకే వసుకుంటాం’. వస్తువును వాడే దాన్ని బట్టి విలువ పెరుగుతుంది. ఇక్కడో మహానుభావుడు బంగారంతో టాయిలెట్ కమోడ్ తయారు చేశాడు. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. ఇది సాధారణ టాయిలెట్ కాదు, ‘కళా విలాసం’లో శిఖర స్థానం దక్కించుకున్న బంగారు టాయిలెట్. 18 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ కళాఖండం మానవ ఆలోచనలు ఏ మేరకు వెళ్తున్నాయో అద్దంలా చూపిస్తోంది.
మౌరిజియో క్యాటల్లాన్ అద్భుత శృష్టి
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆర్టిస్ట్ ‘మౌరిజియో క్యాటల్లాన్’ ఈ కమోడ్ తయారు చేసి వార్తల్లోకి ఎక్కారు. పూర్వం ఆయన చేసిన బంగారు టాయిలెట్ ‘అమెరికా’ (దానికి ఆ పేరు పెట్టారు)ను తయారు చేసి ఆశ్చర్య పరిచారు. దాన్ని న్యూయార్క్‌లో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇది సందర్శకుల దృష్టిని ‘ఆకర్షించింది’. తర్వాత బ్రిటన్‌లో ప్రదర్శనలో ఉంచగా.. దొంగలు దానిపై తమ కళను ప్రదర్శించారు. నాలుగు నిమిషాల్లోనే చోరీ చేశారు. అది కూడా ‘ఆర్ట్ అండ్ క్రైమ్ కలయిక’గా! అప్పటి నుంచి బంగారు టాయిలెట్ లభ్యం కాని వస్తువుల జాబితాలో చేరింది. దానిని కరిగించి బంగారు గొలుసు వేసుకున్నారేమో ఎవరికీ తెలియదు. కానీ క్యాటల్లాన్ లాంటి వ్యక్తి దాంతో ఆడలేదు. ఆయన మళ్లీ మరో బంగారు టాయిలెట్ తయారు చేశాడు. ఎందుకంటే కళాకారుడి మనసు అలాంటిది మరి. ఇప్పుడు ఈ కొత్త బంగారు కమోడ్ నెల 18న సౌత్‌బే వేలంలో మళ్లీ మనమందరిని అలరించనుంది.
100 కిలోల బంగారంతో..
ఈ కమోడ్ తయారీకి 100 కిలోల బంగారం వినియోగించారట. ఇంతటి కమోడ్ కేవలం ప్రదర్శనకు మాత్రమే. అదే దీనితో ఏదైనా అద్భుతమైన కళాఖండం నిర్మిస్తే.. బహూషా సందర్శకులు ఇందులో వింతేముంది అనుకునే వారేమో.. అందుకే క్యాటలాన్ కు వెరైటీగా ఉండాలని దీన్ని తయారు చేశారు. దీన్ని ప్రదర్శనకు మాత్రమే ఉంచుతారు.
దొంగలెత్తుకెళ్లిన ‘అమెరికా’
ఇంకా వింతేంటంటే.. గతంలో తయారు చేసిన ‘అమెరికా’ను అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనాలనుకున్నారట. ఆయనకు అది ఆఫీస్ ఫర్నీచర్‌గా అనిపించి ఉండొచ్చు కాబోలు. కానీ చివరికి అది దొంగిలించబడింది. ఎవరు దోచుకున్నారనేది ఇప్పటికీ తెలియదు. బహుశా ఆ టాయిలెట్ మీద కూర్చునే అదృష్టం దొంగలు దక్కించుకున్నారేమో.
ఈ సారి వేలానికి ఎంత పలుకవచ్చు..
క్యాటల్లాన్ అయితే ఈ సారి తన కళను మరింత పదును పెట్టాడు. ప్రపంచం మళ్లీ అతని బంగారు ‘ఆలోచనల’ వెనుక పరుగులు తీస్తోందని మనం ఆలోచించాల్సింది. క్యాటల్లాన్ తన కళతో ఏం సందేశం ఇస్తున్నారు. ‘ఎంతటి విలువైన వస్తువైనా మానవుడి తర్వాతే’ననా.. లేక ‘ఎంతటి విలువైనదైనా మనిషి తలుచుకుంటే ఎలాగైనా ఉపయోగించగలడనా’. ఏది ఏమైనా గోల్డెన్ కమోడ్ ను ఊహించుకుంటేనే కొందరు క్యాటల్లాన్ పై విరుచుకుపడుతున్నారు.