కాక్రోచ్ జ‌న‌తా పార్టీ విద్రోహ శ‌క్తి.. అమెరికా నుంచి నిధులు: సింగ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అమెరికా సింగ‌ర్‌.. మేరీ మిల్బ‌న్‌.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ)పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించా రు.

Update: 2026-10-14 10:37 GMT

అమెరికా సింగ‌ర్‌.. మేరీ మిల్బ‌న్‌.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ)పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించా రు. ఇన్‌స్టా వేదిక‌గా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత‌లు త‌మ‌కు ఆయుధంగా మ‌లుచుకోగా.. అభిజిత్ దీప్కే స‌హా.. సీజేపీ నేత‌లు మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక‌, మేరీ చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. సీజేపీపై ఇప్పుడున్న ఇమేజ్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఏం జ‌రిగింది...?

దేశంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఉద్యమం న‌కిలీద‌ని, విద్రోహ శ‌క్తుల‌తో సీజేపీకి సంబంధాలు ఉన్నాయ‌ని అమెరికన్ సింగర్ మేరీ మిల్బన్ సంచలన ఆరోపణలు చేశారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికాకు చెందిన దాతల నుండి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. విదేశీ నిధులను తీసుకుంటున్న సీజేపీ భార‌త్‌లో విధ్వంసాల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

భార‌త దేశంలో నడుస్తున్న ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి అమెరికాలోని కొంతమంది దాతలు వెనకుండి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని మేరీ మిల్బ‌న్‌ ఆరోపించారు. అంతేకాదు.. తాను ఇప్ప‌టికే అన్ని విష‌యాలు తెలిసినా.. మౌనంగా ఉన్నాన‌ని తెలిపారు. కానీ, ఇప్పుడు మౌనంగా ఉండే సమయం దాటిపోయింద‌న్నారు. ఇది భారతదేశానికి సంబంధించిన కీలక విషయమని, ఇలాంటి సమయంలో తాను ఇక‌పై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని మేరీ స్ప‌ష్టం చేశారు.

అదేస‌మ‌యంలో మేరీ.. యువ‌త‌కు పిలుపునిస్తూ.. దేశంలోని "యువ దేశభక్తులు`` అందరూ ముందుకు వచ్చి దేశ శ్రేయస్సు కోసం నిలబడాలని అన్నారు. కాక్రోచ్ వంటి విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మ‌రిన్ని విష‌యాల‌ను తాను త్వ‌ర‌లోనే బ‌య‌ట పెట్ట‌నున్న‌ట్టు మేరీ వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ఆమె ప్ర‌శంస‌లు గుప్పించారు.

గ‌త 25 ఏళ్లుగా ప్ర‌జాసేవ‌లో ఉన్న మోడీ.. ఇలాంటి(సీజేపీ) విద్రోహ శ‌క్తుల‌కు త‌ల వంచ‌ర‌ని పేర్కొన్నారు. ఇలాంటి శ‌క్తులు చాలా చోట్ల ఉన్నాయ‌ని.. ఎక్క‌డా విజ‌యం సాధించ‌లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ నేతృత్వంలో భార‌త్ వెలిగిపోతోంద‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్య‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని సీజేపీ నైజం ఇదేన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. తాము మొద‌టి నుంచి అనుమానిస్తున్న‌దే ఇప్పుడు జ‌రుగుతోంద‌ని బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.




Tags:    

Similar News