జగన్ కోర్టుకు రావాల్సిందేనా? సీబీఐ కోర్టు తీర్పుపై హాట్ డిబేట్
మరోవైపు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు ఈ పరిణామం రాజకీయంగా పెద్ద ఆయుధంగా మారనుంది.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణలో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులను కూడా రోజువారీ ప్రాతిపదికన విచారించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. గత పదేళ్లుగా విచారణకు నోచుకోకుండా ఉన్న 9 ఈడీ ఛార్జ్షీట్లపై రోజువారీ విచారణ జరపాలని ఈడీ అధికారులతో పాటు పలువురు పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం స్పందించడంతో విచారణ ప్రక్రియ వేగవంతమైందన అంటున్నారు. ఈ నిర్ణయంతో జగన్తో పాటు దాదాపు 70 మంది నిందితులను కోర్టు వ్యక్తిగతంగా విచారించనుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసుల విచారణ ఇప్పుడు కీలక ఘట్టానికి చేరడంతో ఏపీ రాజకీయం కూడా మంటెక్కిపోతోందని అంటున్నారు.
ఈ కేసుల రోజువారీ విచారణ కేవలం చట్టపరమైన పరిణామాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టు విచారణలకు హాజరుకావాల్సివుందనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్ రెడ్డి ఇప్పటివరకు వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఉన్నారు. ఈడీ కేసుల విషయంలో సీబీఐ కోర్టు నిర్ణయంతో ఆయన షెడ్యూల్ మారే అవకాశం ఉందని అంటున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండటం, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడం, విస్తృత పర్యటనలు చేపట్టడం వంటి అంశాల్లో కాలపరిమితి సవాలుగా మారవచ్చు అని చెబుతున్నాు. ముఖ్యంగా ప్రధాన నిందితులుగా ఉన్న కీలక నేతలు, మాజీ అధికారులకు కూడా ఈ విచారణ ప్రక్రియ అనివార్యం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఒకవిధమైన అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు ఈ పరిణామం రాజకీయంగా పెద్ద ఆయుధంగా మారనుంది. గత పదేళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతో విచారణ ఆలస్యమవుతోందని ఆరోపిస్తున్న ప్రత్యర్థులు, ఈ రోజువారీ విచారణను తమ ప్రచారానికి ప్రధాన అంశంగా మలచుకునే వీలుందని అంటున్నారు. దశాబ్ద కాలంగా సాగుతున్న కేసుల్లో త్వరలోనే ఒక స్పష్టత రాబోతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఇది వైసీపీపై మానసికంగా, రాజకీయంగా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే పరిణామంగా విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. విచారణను వేగవంతం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకే యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని 'రాజకీయ కక్ష సాధింపు' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోందని అంటున్నారు. తమ నేతను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇటువంటి ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే సెంటిమెంట్ను రగల్చడం ద్వారా క్యాడర్ను ఏకం చేయవచ్చని వైసీపీ భావిస్తోంది.
మొత్తానికి, ఈడీ కేసులలో ప్రధానంగా ఆస్తుల జప్తు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విచారణ వేగవంతమై ఫలితాలు వెలువడటం అనేది ఏపీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారనుంది. హైకోర్టు జోక్యంతో సీబీఐ కోర్టు తీసుకున్న ఈ రోజువారీ విచారణ నిర్ణయం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.