సీట్ల పంపకాలపై ఉత్కంఠ: సీఎం ఇంట్లో తుది చర్చలు, కాసేపట్లో తుది నిర్ణయం
స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది.
స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలను తమకు కేటాయించాల్సిందిగా జనసేనాని పవన్ కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే 4 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు ఇచ్చేందుకు టీడీపీ సిద్దంగా ఉన్నప్పటికీ పవన్ మాత్రం సంతృప్తి చెందడం లేదని అంటున్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి చర్చించారు. వారితో తమ పార్టీ ప్రతిపాదనను తెలిపిన పవన్ అందుకు ఒక్కసీటు తగ్గినా అంగీకరించేది లేదని చెప్పారని అంటున్నారు. దీంతో సర్దుబాటు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరిందని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల సీట్లు సర్దుబాటుపై చిక్కుముడి ఎలా వీడుతుందనే చర్చ ఆసక్తి రేపుతోంది. తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న జన సేన నేతలు మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో జన సేనకు కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మంగళవారం నాటి చర్చల్లో పవన్ అసంతృప్తికి లోనయ్యారని జరిగిన ప్రచారం రాజకీయ వాతావరణాన్ని వేడిక్కించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని ఉత్కంఠ ఎక్కువ అవుతోంది.
సీట్ల సర్దుబాటుపై పంచాయతీ తేలకపోవడంతో కూటమిలో మూడు పార్టీల్లోనూ కార్యకర్తలు, నాయకులు టెన్షన్ కు గురవుతున్నారు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనేది తేలిపోతే, అప్పుడు పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రితో సమావేశంలో ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరు స్థానాలు కోరుతున్న జనసేన ఏమైనా తగ్గే అవకాశం ఉందా? లేదా? అనేదానిపై చర్చల పురోగతి ఉండబోతోందని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకటి రెండు సీట్ల విషయంలో పేచీ వద్దని తమ పార్టీ నేతలకు సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం కూడా ఆసక్తి రేపుతోంది.
జనసేన ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గి ఆ పార్టీ కోరుతున్నట్లుగా 6 మేయర్, 26 మున్సిపాలిటీలు ఇచ్చేందుకు అంగీకరిస్తే, తదుపరి ఆయా సీట్లపై సమన్వయకమిటీ సభ్యుల స్థాయిలో చర్చలు కొనసాగుతాయని అంటున్నారు. ఏదిఏమైనా ఈ రోజు సాయంత్రానికి తుది అవగాహన కుదిరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినా, ఆ తర్వాత ఏయే స్థానాలు అన్న విషయమై చర్చ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మున్సిపల్ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం అసంతృప్తికి లోనయ్యారనే మరో ప్రచారం కూడా ముఖ్యమంత్రితో జరుగుతున్న సమావేశంలో కీలక చర్చకు దారితీస్తోందని అంటున్నారు. తనకు కొన్ని ఆబ్లిగేషన్లు ఉండగా, కనీసం మాట మాత్రం చెప్పకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి నిమ్మల రామానాయుడు సర్దిచెప్పినప్పటికీ పవన్ మాత్రం తన అసమ్మతిని తెలియజేశారని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. మొత్తానికి కూటమిలో సీట్ల సర్దుబాటు వాడివేడిగా సాగుతోందని చెబుతున్నారు.