జనసేన వాటా 40.1%.. హీట్ పుట్టిస్తున్న మంత్రి దుర్గేష్ ట్వీట్
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహాలు రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి.
Kiమున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహాలు రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని, తమ త్యాగాలకు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ వచ్చిన జనసేన ఇప్పుడు కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా తాము 40.1 శాతం సీట్లు అడుగుతున్నామని, జనసేన వాటా కింద ఆయా పదవులను వదిలేయాలని మంత్రి కందుల దుర్గేష్ చేసిన ట్వీట్ విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఊహాగానాలు మాత్రమే ప్రచారంలో ఉండగా, మంత్రి కందుల దుర్గేష్ మాత్రం అధికారికంగా ఎక్స్ లో వివరాలు వెల్లడించి మిత్రపక్షం టీడీపీని తీవ్ర ఒత్తిడికి ఉలికిపాటుకు గురిచేశారని అంటున్నారు.
రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీలు, 16 నగర పంచాయతీలు, 4843 కార్పొరేటర్, కౌన్సిల్ పదవులు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన వాటా ప్రకారం ఇందులో 40 శాతం పదవులు జనసేనకు దక్కుతాయని మంత్రి ట్వీట్ చేశారు. ఈ పదవులకు తోడుగా స్టాండింగ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఇలా మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని పదవుల్లో తమకు వాటా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఇలా మొత్తం 5,220 పదవులు ఉంటే అందులో తమకు 2091 పోస్టులు కట్టబెట్టాలని స్పష్టం చేస్తూ మంత్రి చేసిన ట్వీట్ హీట్ పుట్టిస్తోంది. జనసేనా వాటా ప్రకారం 17 కార్పొరేషన్లలో 6 మేయర్, అంతే సంఖ్యలో డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వాల్సివుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇక 90 మున్సిపాలిటీల్లో 40 శాతం వాటా కింద 38, వైస్ చైర్మన్ పదవులు 41 చొప్పున ఇవ్వాలని జనసేన ప్రతిపాదిస్తున్నట్లుగా చెప్పారు. కొన్ని చోట్ల 40 శాతం, మరికొన్నిచోట్ల 35 శాతం పదవుల వాటా కోరుతున్న జనసేన మొత్తంగా సగటు 40 శాతం దాటకుండా చూసుకుంది. దీనిద్వారా తాము టీడీపీతో సమానంగా పదవులు కోరుకుంటున్నట్లు స్పష్టం చేసిందని అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా పది శాతం సీట్లు కోరుకుంటుండటం వల్ల టీడీపీ సగం సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, జనసేన సీట్ల సర్దుబాటు ప్రతిపాదనపై టీడీపీ నేతలు షాక్ కు గురవుతున్నారు. పొత్తు ధర్మమన్న పేరుతో జనసేన స్థాయికి మించి సీట్లు కోరుకుంటోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న తమ పార్టీతో సమానంగా జనసేన పదవులు కోరుకోవడం కరెక్టు కాదని అంటున్నారు. జనసేన సామర్థ్యానికి తగినట్లు ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్నచోట సీట్లు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేకపోయినా, బలం లేని చోట కూడా వాటా పేరిట పేచీలకు దిగడంపైనే టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. నిజానికి జనసేనలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు తగిన అభ్యర్థులు చాలా చోట్ల లేరన్న విషయాన్ని కూడా ఆ పార్టీ దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.
విజయవాడ మేయర్ సీటు కోరుకుంటున్న జనసేన తన అభ్యర్థి కోసం మళ్లీ టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణను తీసుకుంటోందని, ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలం పెంచుకోవడం కోసం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఎక్కువ సీట్లు అడుగుతోందని, అయితే సరైన అభ్యర్థులు లేకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రావడం అంత సులువైన విషయం కాదన్న నిజాన్ని జనసేన పెద్దలు పరిశీలించాలని టీడీపీ కేడర్ సూచిస్తున్నారు. మొత్తానికి జనసేన ఆశలు, ప్రతిపాదనలు టీడీపీ అధిష్టానంతోపాటు ఆ పార్టీ నేతలను కంగారెత్తిస్తున్నట్లుగా చెబుతున్నారు.