ఎప్పుడు చూడని ప్రతిఘటన చూస్తావ్.. ట్రంప్ కు ఇరాన్ డెడ్లీ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.;
అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనిని తొలగిస్తే.. అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మార్క్ రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనినీ తొలగిస్తే అధికారం ఎవరు చేపడతారో తెలియదని, అది ఒక బహిరంగ ప్రశ్న అని అన్నారు. ఇరాన్ పాలన ఖమేనీ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో పాటు, ఎన్నికైన ప్రతినిధుల మధ్య విభజించి ఉందని, వారంతా కూడా ఖమేని ఆదేశానుసారమే నడుచుకుంటారని పేర్కొన్నారు. సుప్రీం లీడర్ పాలన పడిపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని అన్నారు. ఇది వెనుజులా కంటే క్లిష్టంగా ఉంటుందని రూబియో తెలిపారు. అక్కడి ప్రభుత్వం పాతుకుపోయిందని, అలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
ట్రంప్ నిర్ణయం,,
పశ్చిమాసియా అంతటా అమెరికన్ సైన్యాన్ని బలోపేతం చేయాలనే ట్రంప్ నిర్ణయంపైన కూడా మార్క్ రూబియో స్పందించారు. ఆ ప్రాంతంలో మోహరించిన సైన్యాన్ని కాపాడటమే ఈ చర్య లక్ష్యమన్నారు. సైనికచర్య అవసరం ఉండకూడదని తాను భావిస్తున్నట్టు రూబియో అన్నారు. అయితే అమెరికా బలగాలు, భాగస్వాములపై దాడి చేసేందుకు ఇరాన్ శక్తిని కూడగట్టుకుంటుదని అన్నారు.
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ డెడ్లీ రియాక్షన్..
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో న్యూక్లియర్ ప్రొగ్రాంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి.. ఇరాన్ కు ఉన్న సమయం గడిచిపోతోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ వైపు అమెరికా సేనలు భారీస్థాయిలో వస్తున్నాయంటూ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల పరస్పర గౌరవం, ప్రయోజనాల కోసం చర్చించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, అలా కాదని రెచ్చగొడితే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రీతిలో ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు మరింత ఆజ్యం తోడైంది. ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదన్నది అమెరికా ఉద్దేశ్యం. ఆ ఒప్పందంపై తమతో చర్చించి, తాము చెప్పినట్టు వినాలని కోరుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఒప్పుకోవడంలేదు.
ఇరాన్ పై వెనుజులా అస్త్రం..
ఇరాన్ పై అమెరికా వెనుజులా అస్త్రం ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికిరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించారు. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఇదే తరహా ప్రణాళిక అమలు చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారన్నది ప్రచారం. స్థానిక ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా, వ్యూహాత్మకంగా ఖమేనిని కిడ్నాప్ చేసి, ఇరాన్ లో తమకు సంబంధించిన వ్యక్తులను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇరాన్ వనరులపై ఆధిపత్యం సాధించి, చైనాకు చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది.