కెనడాకు కాబోయే ప్రధాని... ట్రంప్ పై అలా - భారత్ పై ఇలా!

అవును... కెనడాలో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సమయంలో.. నూతన ప్రధానిగా మరోసారి మార్క్ కార్ని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.;

Update: 2025-04-29 09:31 GMT

కెనడాలో అధికార లిబరల్ పార్టీ మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీంతో... కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారత్ తో బలహీనపడిన బంధాలు, ట్రంప్ సుంకాల యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కెనడాలో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సమయంలో.. నూతన ప్రధానిగా మరోసారి మార్క్ కార్ని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో... మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో పాలనలో గణనీయంగా దెబ్బతిన్న న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో సాధ్యమైన మెరుగుదలను సూచిస్తుందని తెలుస్తోంది.

తాజాగా ప్రసంగించిన కార్నీ... ప్రజల్లో విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారని.. ఆ ఉద్దేశంతోనే అమెరికా సుంకాలు, విలీనానికి సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అయితే... ఎట్టిపరిస్థితుల్లోనూ కెనడియన్లు ఐక్యంగా ఉండాలని.. అమెరికా బెదిరింపులకు భయపడకూడదని అన్నారు.

మరోపక్క తన ప్రచారంలో కార్నీ.. భారత్ తో సంబంధాలను పునర్నిర్మించడం ప్రాధాన్యతగా గుర్తించారు. ఇందులో భాగంగా... భారత్ తో సంబంధాన్ని పునర్నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ వాణిజ్య సంబంధం చుట్టూ విలువల ఉమ్మడి భావన ఉండాలని.. తాను మరోసారి ప్రధాని అయితే దాన్ని నిర్మించే అవకాశం కోసం ఎదురుచూస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కాగా... 2023 జూన్ లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వార్ వెలుపల కెనడియన్ పౌరుడు, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉందని ట్రూడో ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు భారత్ తీవ్రంగా ఖండించింది. నాటి నుంచి భారత్ - కెనడా సంబధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి.

మరోపక్క... కెనడా తమలో విలీనం కావాలని ఇప్పటికే పలుమార్పు ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెనడా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆయన మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ... అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే ఇప్పటివరకూ విధించిన సుంకాలను పూర్తిగా తొలగిస్తామని అన్నారు.

Tags:    

Similar News