ఎవరీ మరియా కొరీనా? ట్రంప్ ను మించి ఈమె ‘శాంతి’ ప్రస్థానమేంటి?

నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి, తన దేశంలో ప్రజాస్వామ్య విలువల కోసం అజ్ఞాతంలో ఉంటూనే అలుపెరగని పోరాటం చేసిన వెనెజువెలా ధీర వనిత మరియా కొరీనా మచాడో కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి లభించింది;

Update: 2025-10-10 16:07 GMT

నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి, తన దేశంలో ప్రజాస్వామ్య విలువల కోసం అజ్ఞాతంలో ఉంటూనే అలుపెరగని పోరాటం చేసిన వెనెజువెలా ధీర వనిత మరియా కొరీనా మచాడో కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యసాహసాలకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. "ప్రజల స్వేచ్ఛా హక్కుల కోసం అజ్ఞాతంలో నుంచే పోరాడిన ఈ సాహసవనిత ప్రపంచ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి" అని నోబెల్‌ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.

“నా దేశం కుప్పకూలుతుంటే… నేను ఇంట్లో కూర్చుని చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్ల బదులు బ్యాలెట్లను ఎంచుకుందాం.” దాదాపు పాతికేళ్ల క్రితం మరియా కొరీనా మచాడో చెప్పిన ఈ మాటలు నేడు వెనెజువెలా ప్రజాస్వామ్య పోరాటానికి ఒక ప్రతీకగా నిలిచాయి.

స్వచ్ఛంద సేవతో మొదలై, రాజకీయ యుద్ధంగా మారిన ప్రయాణం

1967 అక్టోబర్‌ 7న జన్మించిన మరియా కొరీనా, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పూర్వీకుల వారసురాలిగా చిన్నప్పటి నుంచే సేవా దృక్పథాన్ని పెంచుకున్నారు. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమె, 1992లో వీధి బాలల కోసం ‘అటెనియా ఫౌండేషన్‌’ను స్థాపించారు. ఈ స్వచ్ఛంద సేవ నుంచే ఆమెలో రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరమనే బలమైన ఆలోచన మొదలైంది.

* ప్రజాస్వామ్య రక్షణ యోధురాలు

పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం 2002లో ‘సుమేట్‌’ అనే ఎన్జీవోకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేసిన మరియా, దశాబ్దం తరువాత ‘వెంటే వెనెజువెలా’ అనే లిబరల్‌ రాజకీయ పార్టీని స్థాపించారు. 2010లో అత్యధిక ఓట్లతో జాతీయ అసెంబ్లీకి ఎన్నికై ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం వెనెజువెలాలో పాలక వర్గాలకు గట్టి హెచ్చరికగా మారింది.

అణచివేతలు – బహిష్కరణ – నిరంతర పోరాటం

జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరణ: 2014లో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ (OAS) సమావేశంలో వెనెజువెలా పరిస్థితులపై ఆమె చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. దీనికి ప్రతీకారంగా ఆమెను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు.

రాజకీయ అణచివేత కొనసాగుతున్నా, 2014 నుండి 2021 వరకు ఆమె రేడియో ప్రసారకర్తగా పనిచేసి, ప్రజాస్వామ్యం, హక్కులు, ఎన్నికల సంస్కరణలపై టాక్‌షో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. 2023లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చి ప్రతిపక్ష ప్రైమరీల్లో ఏకంగా 90% ఓట్లు సాధించి పాలకవర్గానికి సవాల్ విసిరారు.

* నిషేధం – అజ్ఞాత జీవితం

2024 అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు ప్రధాన ప్రత్యర్థిగా మారిన మరియాపై ప్రభుత్వం 15 ఏళ్ల రాజకీయ అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ అణచివేతలకు తలొగ్గకుండా ఆమె ప్రజల తరఫున నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఈ ఏడాది ప్రారంభంలో భద్రతా దళాలు ఆమెను అదుపులోకి తీసుకున్నాయని వార్తలు వచ్చినప్పటి నుంచి ఆమె ప్రజా జీవితంలో కన్పించకపోయినా, సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు.

ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛా హక్కుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి, అణచివేతకు భయపడకుండా పోరాడిన ఆమె ధైర్యం, చివరకు నోబెల్ శాంతి బహుమతి రూపంలో అంతర్జాతీయ గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడే వారికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది.

Tags:    

Similar News