'మావోయిస్టు ఉద్యమానికి ఊపిరినవుతా!' అన్న ఆశన్న కూడా.. లొంగుబాట!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశన్న.. డిగ్రీ వరకు చదివినట్టు చెబుతారు. విద్యార్థి దశలోనే ఆయన సాయుధ పోరాటానికి ప్రభావితుడై.. మావోయిస్టుల్లో చేరిపోయారు.;
`మావోయిస్టు ఉద్యమానికి ఊపిరినవుతా!. ఎవరు పోయినా.. ఎందరు పారిపోయినా.. జీవితకాలం ఈ ఉద్యమానికి ఊపరిలూ దుతా!. గిరిజనుల హక్కుల కోసం ప్రాణం పణంగా పెడతా!.`- అంటూ.. రెండు మాసాల కింద భారీ వ్యాఖ్యలతో లేఖ సంధించిన సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న(అసలు పేరు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు) తాజాగా అస్త్ర సన్యాసం చేశారు. ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముందు గురువారం లొంగిపోతున్నారంటూ.. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. దీనిపై అధికారికంగా మహారాష్ట్ర నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఎవరీ ఆశన్న?!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశన్న.. డిగ్రీ వరకు చదివినట్టు చెబుతారు. విద్యార్థి దశలోనే ఆయన సాయుధ పోరాటానికి ప్రభావితుడై.. మావోయిస్టుల్లో చేరిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆయుధాల తయారీ.. గెరిల్లా యుద్ధాలు వంటివాటిలో ఆరితేరారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులు.. పోలీసు అధికారులను హత్య చేసేందుకు నిర్దేశించిన కుట్రలను ఫైనల్ చేసే నాయకుడిగా కూడా పేరుంది. గతంలో జరిగిన ఐపీఎస్ ఉమేష్ చంద్ర దారుణ హత్య, ఉమ్మడి ఏపీ హోం శాఖ మంత్రి మాధవరెడ్డి హత్యలకు సంబంధించిన ప్లాన్‌ను ఆమోదించి.. అమలు చేసిన వారిలో ఆశన్న ఒకరు.
అంతేకాదు.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో వైఎస్‌తో వాదనకు దిగిన మావోయిస్టు నాయకుడిగా కూడా మల్లోజుల, ఆశన్నలు వున్నారు. మల్లోజుల వేణుగోపాల్‌రావు.. మంగళవారం ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు.. మరో 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయి.. 54 ఆయుధాలను కూడా సరెండర్ చేశారు. ఇక, ఇప్పుడు కీలక నేతగా.. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిలూదుతానని ప్రతిజ్ఞ చేసిన ఆశన్న కూడా గురువారం లొంగిపోయేందుకు రెడీ అయ్యారు.
ఆయనతోపాటు.. మరో 75 మంది కీలక నాయకులు కూడా మహారాష్ట్ర, లేదా ఛత్తీస్‌గఢ్ సీఎంల ముందు లొంగిపోయే అవకాశం ఉంది. ఇక, ఆశన్నపైనా రూ.5 కోట్ల కుపైగా రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉండగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్.. తాజాగా ఆయనకు నగదు ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో ఆశన్న కూడా చేరడంతో ఇక, మావోయిస్టు ఉద్యమానికి.. వెన్ను విరిగిపోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అనేక మంది కీలక నాయకులు మృతి చెందడం లేదా లొంగిపోయిన నేపథ్యంలో ఉద్యమం కకావికలం అయిందని చెబుతున్నారు.