ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మరో దంగల్‌!

అదేవిధంగా తాజాగా మహబూబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌ రెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది.

Update: 2024-03-09 12:17 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక కాంగ్రెస్‌ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ పార్టీయే గెలుచుకుంటుందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది.

అదేవిధంగా తాజాగా మహబూబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌ రెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. గతంలోనే ఈయన పేరును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

కాగా ఇటీవలే జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బాబాయి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ ఎంపీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మహబూబ్‌ నగర్‌ లో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీగా జీవన్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

కాగా మన్నె జీవన్‌ రెడ్డి స్వస్థలం... మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామం. ఆయన ప్రస్తుతం ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Read more!

మరోవైపు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తమ పార్టీ అభ్యర్థిగా నవీన్‌ రెడ్డి పేరును ప్రకటించింది. ఆయన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ఖరారు కావడంతో పోటీ అనివార్యంగా మారింది.

మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు సమర్పించడానికి మార్చి 11 వరకు గడువు ఉంది. 12న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఈనెల 28న పోలింగ్‌ నిర్వహిస్తారు ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

బీఆర్‌ఎస్‌ కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది.

Tags:    

Similar News