మంగళూరులో మహా మాయగారు.. 8 ఏళ్లలో కూలి నుంచి రూ.కోట్లు సంపాదన
మంగళూరుకు చెందిన రొనాల్డ్ సల్దానా (45) స్టోరీ ఇది. 2016లో కూలి పనులు చేసుకుని పొట్టపోసుకున్న అతడు ఇప్పుడు కోటీశ్వరుడు.;
8 ఏళ్ల క్రితం కూలి పనులు చేసుకున్న ఓ వ్యక్తి కోట్లకు పడగలెత్తాడు. అత్యాధునిక వసతులతో కూడిన ఇళ్లు, ఖరీదైన వాహనాలు, బ్యాంకు అకౌంట్లలో కోట్ల రూపాయల నగదు.. అతడి ఎదుగుదలను చూసిన ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. కూలి పనులు చేసుకున్న వ్యక్తి ఈ స్థాయికి ఎలా ఎదిగాడన్నది మాత్రం అత్యంత రహస్యం. అయితే ఆ రహస్యాన్ని మంగళూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చాలా కాలంగా తమను తిప్పలు పెడుతున్న ఓ బడా మోసగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. నాలుగు గోడల మధ్యలోనే ఉంటూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడం ఆ మోసగాడి స్పెషల్ టాలెంట్. ఏదిఏమైనా పోలీసుల పకడ్బందీ వ్యూహంతో అతడి పాపం బద్ధలైంది.
మంగళూరుకు చెందిన రొనాల్డ్ సల్దానా (45) స్టోరీ ఇది. 2016లో కూలి పనులు చేసుకుని పొట్టపోసుకున్న అతడు ఇప్పుడు కోటీశ్వరుడు. ప్రస్తుతం ఆయన బ్యాంకు బ్యాలెన్స్ రూ.40 కోట్లు. ఇంత డబ్బు ఆయన ఎలా సంపాదించాడో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. మోసాలే పెట్టుబడిగా 8 ఏళ్లుగా దందాలు నిర్వహిస్తున్న రొనాల్డ్ రోస్ పాపాలు ఎట్టకేలకు పోలీసులు బద్ధలు కొట్టారు. అతడిపై వస్తున్న ఫిర్యాదులతో పలుమార్లు అరెస్టు చేసేందుకు వెళ్లినా, చిక్కినట్లే చిక్కి తప్పించుకునేవాడు. అలా అని ఎక్కడికీ పరారయ్యేవాడు కూడా కాదు. తన ఇంట్లోనే రహస్య గదిలో దాక్కుని పోలీసుల కంట పడకుండా ఇన్నాళ్లు తప్పించుకున్నట్లు ఎట్టకేలకు గుర్తించారు.
తనకు మంచి పలుకుబడి ఉందని, పెద్ద పెద్ద వారితో స్నేహాలు ఉన్నట్లు ప్రచారం చేసుకున్న రొనాల్డ్ సల్దానా.. పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులను బుట్టలో వేసుకునేవాడు. రూ.వంద నుంచి రూ.600 కోట్ల వరకు అప్పులు ఇప్పిస్తానని వారిని మగ్గులోకి దింపేవాడు. వారిని తన ఇంటికి రప్పించి ఖరీదైన మద్యం, విదేశీ యువతులతో సేవలు చేయించి ఆకట్టుకునేవాడు. ఇక రుణం కావాలంటే ప్రాసెసింగు ఫీజుగా రూ.50 నుంచి రూ.4 కోట్లు చెల్లించాలని నమ్మించేవాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు అంటూ మరికొందరు వద్ద డబ్బు గుంజుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇలా దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసిన నిందితుడు పలువురు వ్యాపారవేత్తలను మోసం చేశాడు.
డబ్బు తీసుకున్న తర్వాత తమ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి వెళితే కనిపించకపోవడం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై వస్తున్న ఫిర్యాదులతో మంగళూరు పోలీసులు పలుమార్లు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, తప్పించుకునేవాడని చెబుతున్నారు. ఇక అతడిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండటంతో మంగళూరు పోలీసు కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సాంకేతిక సహాయంతో ప్రత్యేక అధికారులను రంగంలోకి దింపారు.
గురువారం అర్ధరాత్రి నిందితుడి ఇంటిపై దాడి చేయగా, మళ్లీ తప్పించుకున్నాడు. అయితే ఆయన ఫోన్ సిగ్నల్ ఇంట్లోనే ఉండటం, తమ వ్యూహం వల్ల అతడు తప్పించుకోడానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు ప్రతి అణువు గాలించారు. ఈ సమయంలో నిందితుడు ఇంట్లో రహస్య గది వెలుగు చూసిందని కమిషనర్ తెలిపారు. రహస్య గదిలో దాక్కున్న నిందితుడు అత్యాధునిక కెమెరాల సాయంతో పోలీసుల కదలికలను ముందే పసిగట్టేవాడని, పోలీసులు వస్తున్నారని తెలిసి దాక్కునేవాడని చెబుతున్నారు. అయితే ఈ సారి అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలనే టార్గెట్ పెట్టుకున్న పోలీసులు చివరికి విజయం సాధించినట్లు చెబుతున్నారు.