మేటర్ సీరియస్... లోదుస్తుల్లో సిగరెట్, మద్యం తాగుతూ కోర్టు విచారణకు..!

ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా బందియా.. అతడు 'అకిబ్ అఖ్లక్' అనే యూజర్ ఐడీతో లాగిన్ అయినట్లు తెలిపారు.;

Update: 2025-10-04 17:27 GMT

విచారణలో వీడియో కాన్ఫరెన్సింగ్ కోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుందనే సంగతి తెలిసిందే. పైగా.. భద్రతా ఇబ్బందులను కూడా ఈ ఆప్షన్ తగ్గిస్తుంది. అయితే ఇటీవల కాలంలో పలువురు ఈ ఆప్షన్ ను దుర్వినియోగపరుస్తున్నారు. ఇందులో భాగంగా టాయిలెట్స్ లో ఉండి కూడా విచారణకు హాజరవుతున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అవును... కోర్టు విచారణ సమయంలో ఓ వ్యక్తి అర్ధనగ్నంగా.. సిగరెట్‌ తాగుతూ, మద్యం సేవిస్తూ ఆన్‌ లైన్‌ లోకి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 16, 17 తేదీల్లో ఓ కేసులో ఢిల్లీ కోర్టు ఆన్‌ లైన్‌ విచారణను చేపట్టింది. విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి లోదుస్తులు మాత్రమే ధరించి అర్ధనగ్నంగా వీడియో కాల్‌ లో లాగిన్‌ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

దానికి తోడు ఆ సమయంలో సదరు వ్యక్తి సిగరెట్‌ తాగుతూ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో... నిందితుడిని న్యూఢిల్లీలోని గోకుల్‌ పురికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్‌ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా బందియా.. అతడు 'అకిబ్ అఖ్లక్' అనే యూజర్ ఐడీతో లాగిన్ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టు విచారణలోకి లాగిన్‌ అయ్యేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, రౌటర్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే అనుమతిలేని ఆన్‌ లైన్‌ విచారణకు అతడు ఎలా లాగిన్ అయ్యాడనేది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇమ్రాన్‌ పై ఢిల్లీ వ్యాప్తంగా 50కి పైగా దోపిడీ, స్నాచింగ్, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతను చివరిసారిగా సెప్టెంబర్ 2021లో జైలు నుండి విడుదలయ్యాడని తెలుస్తోంది. అప్పటి నుండి మాదకద్రవ్యాలు, మద్యానికి బానిస కావడానికి నిధులు సమకూర్చుకోవడానికి దోపిడీ, స్నాచింగ్, ఆయుధాల చట్టం కింద ఉల్లంఘనలతో సహా నేర కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News