మమతకు కష్టమొచ్చింది...అంతా కలిసి రావాలి
తృణమూల్ కాంగ్రెస్ అధినేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు.;
తృణమూల్ కాంగ్రెస్ అధినేత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు. ఆమె 2011 నుంచి 2026 మే 4 వరకూ అంతా తానే అన్నట్లుగా తాను సృష్టించుకున్న రాజకీయ ప్రపంచంలో ఉండిపోయారు. తన ముందు ఏ రాజకీయ పార్టీ అయినా తక్కువే అన్నట్లుగా వ్యవహరించారు. ఆమె ఆధిపత్య వైఖరికి బాధితుల జాబితా చాలా పెద్దదే. 1998, 1999లలో వాజ్ పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మమత ఎన్నో సార్లు ఇబ్బందులు పెట్టిన సంగతులూ చెబుతారు. ఆ తరువాత యూపీయే ప్రభుత్వంలో చేరిన మమత సోనియా గాంధీని సైతం ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారు. ఇక ఆది నుంచి వామపక్షాలతో ఆమె పోరాటం చేస్తూ చివరికి వారి నుంచి 2011లో పశ్చిమ బెంగాల్ లో అధికారం అందుకున్నారు. ఇలా దేశంలో ప్రధాన పార్టీలతో మమత దూకుడుగా వ్యవహరించిన తీరు అందరూ గుర్తు చేసుకుంటారు.
పొత్తుల్లేవు అంటూ :
కాంగ్రెస్ తో 2016లో బెంగాల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న మమత తాజా ఎన్నికల్లో మాత్రం పొత్తుకు దూరం అన్నారు. అలాగే వామపక్షాలతోనూ పొత్తుకు దూరం ఎపుడూ పాటిస్తూనే వచ్చారు. ఇక ఓటమి జరిగాక మమతని తత్వం బోధపడింది అని అంటున్నారు. దేశంలో బీజేపీ ఒక్కటే ప్రధాన శత్రువు అని ఆ పార్టీతో పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని మమతా బెనర్జీ పిలుపు ఇస్తున్నారు.
బెంగాల్ లో దుష్ట శక్తులు :
పశ్చిమ బెంగాల్ లో దుష్ట శక్తులు ప్రవేశించాయని మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలలోనే మమత ఈ రకమైన కఠిన ప్రకటన చేశారు. బీజేపీని నిలువరించేందుకు విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేయడం విశేషం. అంతే కాదు వామపక్షాలు ప్రతిపక్షాలు కలిసి రావాలని మమతా బెనర్జీ పిలుపు ఇవ్వడం కూడా గమనార్హం. అందరం కలిసి బీజేపీపైన పోరాటం చేద్దామని మమత కోరుతున్నారు.
పార్టీలన్నీ ఏకం కావాలి :
దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలని మమతా బెనర్జీ సూచిస్తున్నారు. అంతే కాదెఉ శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఆలోచించే సమయం ఇది కాదని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు తనతో మాట్లాడారని మమతా బెనర్జీ చెప్పారు. అదే సమయంలో తాను ఎవరి సానుభూతిని కోరుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక బీజేపీతో సాగించే యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీకి తీరని అన్యాయం జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికలు సక్రమంగా జరగలేదు అన్నది ఆమె వాదనగా ఉంది.
చేతులు కలుపుతారా :
కాంగ్రెస్ కమ్యూనిస్టులను దూరం పెట్టి పదిహేనేళ్ళ పాలన చేసిన మమతా బెనర్జీ ఇపుడు తాను ఓడి తనకు కష్టం వచ్చింది కాబట్టి అంతా కలవాలని అంటున్నారు. మనలో మనకు శతృత్వం వద్దు అంతా కలసి బీజేపీ మీదకు దండెత్తాలని ఆమె చెబుతున్నారు. అయితే మమతా దూకుడు రాజకీయం తెలిసిన వారు అంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇపుడు కూడా ఆమె ఇండియా కూటమి నాయకత్వం కోరుకుంటున్నారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది అని అంటున్నారు. అయితే బెంగాల్ లో ఓడి మాజీ అయిన మమతకు ఏ మేరకు నాయకత్వం పగ్గాలు దక్కుతాయన్నది చూడాల్సి ఉంది. అయితే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే లెఫ్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్ మమతతో కలసి పనిచేయడానికి చూస్తాయి, కానీ అదే సమయంలో ఆమె ఏకపక్ష విధానాలు అయితే ఇక మీదట చెల్లవని అంటున్నారు. మొత్తానికి మమతకు అందరి అవసరం ఇపుడు కావాల్సి ఉంది. ఆమె బీజేపీ బూచిని చూపిస్తున్నారు. తనదైన రాజకీయానికి పదును పెడుతున్నారని విశ్లేషిస్తున్నారు.