ఎమ్మెల్యేల దారిలోనే ఎంపీలు?.. ఆసక్తికరంగా ‘తృణమూల్’ పరిణామాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలు వరుసగా ఝలక్ ఇస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలు వరుసగా ఝలక్ ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన కొద్దిరోజుల్లోనే పార్టీలో ఊహించని రీతిలో భారీ చీలిక ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకోగా, ఇప్పుడు ఎంపీలు కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. మమత నాయకత్వం నుంచి విడివడి తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ గా చెప్పుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పార్లమెంట్‌కూ పాకిన తిరుగుబాటు
టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా స్పీకర్ గుర్తించడమే కాకుండా, రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామాలతోనే మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ తిన్నారని అనుకుంటుండగా, పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా అదే తరహా తిరుగుబాటుకు సిద్దమవుతున్నారనే సంకేతాలు అందుతున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభలో టీఎంసీకి మొత్తం 29 మంది ఎంపీలు ఉండగా, ఏకంగా 20 మంది ఎంపీలు మమత పక్షాన్ని వీడటానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో 13 మంది రాజ్యసభ సభ్యుల్లో 9 మంది తిరుగుబాటు వర్గంతో చేతులు కలిపినట్లు చెబుతున్నారు.
రాఘవ్ చడ్ఢా వ్యూహంతో తిరుగుబాటు నేతలు
ఢిల్లీలో గతంలో ఆప్ పరిణామాల తరహాలోనే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలంతా కలిసి గ్రూపుగా ఏర్పడి ‘తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్’ అని క్లెయిమ్ చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు అవసరమైన 2/3 వంతు మెజారిటీని సాధించిన ఈ ఎంపీలు, త్వరలోనే పార్లమెంట్ స్పీకర్‌ను కలిసి తమను విడిగా గుర్తించాలని కోరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక టీఎంసీలో తాజా పరిణామాలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
దశాబ్దన్నర కాలం తర్వాత ఎదురైన ఘోర పరాజయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపిందని చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల నాయకత్వ వైఫల్యంపై సొంత పార్టీలోనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను, సీనియర్ నాయకులను కాదని, ఐప్యాక్ వ్యూహకర్తలపై మితిమీరి ఆధారపడటమే ఈ ఘోర పరాజయానికి కారణమని మెజారిటీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టడం వల్ల వచ్చిన కోపమే తిరుగుబాటుగా మారిందని విశ్లేషిస్తున్నారు.
దీదీ అప్రమత్తం
పార్టీ చేజారిపోతుండటంతో అప్రమత్తమైన మమతా బెనర్జీ బెంగాల్‌లోని అన్ని అంతర్గత కమిటీలను, అనుబంధ విభాగాలను తక్షణమే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తామని ప్రకటించినప్పటికీ, అప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతులు దాటిపోవడంతో నాయకత్వం తీవ్ర రక్షణలో పడిందని చెబుతున్నారు. ఓ వైపు అధికార బీజేపీ శరవేగంగా పరిపాలనపై పట్టు సాధిస్తుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన టీఎంసీ అంతర్గత కుమ్ములాటలతో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి హాట్ టాపిక్ అవుతోంది. దీంతో జాతీయస్థాయిలో కూడా మమతకు ప్రాధాన్యం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.