బెంగాల్ పోలింగ్: మమతకు ఫీవర్ 'సర్'!
అయితే.. ఇప్పుడు అతి పెద్ద సమస్య.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సర్ ప్రక్రియ ద్వారా తొలిగించిన లక్షలాది ఓట్లే!;
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరో 4 రోజుల్లోనే జరగనున్నాయి. అయితే.. ఇప్పుడు అతి పెద్ద సమస్య.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సర్ ప్రక్రియ ద్వారా తొలిగించిన లక్షలాది ఓట్లే!. నిన్న మొన్నటి వరకు ఈ విషయంపై సుప్రీంకోర్టు ను ఆశ్రయించి.. ఒకింత ఊరట పొందినా.. తాజాగా సంచలన విషయం చోటు చేసుకుంది.
సర్ ప్రక్రియ ద్వారా తొలగించిన ఓట్లలో నిజమైనవి ఉంటే.. ఆ ఓటు హక్కు ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిని క్షేత్రస్థాయిలో న్యాయాధికారులకు అప్పగించింది. మొత్తం కోటి మంది ఓట్లను తొలగించారు. ఇవన్నీ.. అధికార టీఎంసీ పార్టీకి బలమైన నియోజకవర్గాల్లోనే తొలగించడం.. ఇప్పుడు సీఎం మమతా బెనర్జీకి షాక్‌గా మారింది.
నిన్న మొన్నటి వరకు నిజమైన ఓటర్లకు అవకాశం ఇస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ఇక, ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. న్యాయాధికారులు కూడా.. ఎవరి పనికి వారు వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో దాదాపు కోటిమంది హక్కును కోల్పోతున్నారు.
దీనిపై తాజాగా మరోసారి మమత ఫైరయ్యారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా.. సర్ తమకు వెంటా డుతూనే ఉందన్నారు. అయితే.. ఎన్నికలకు వారం ముందు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని.. ఆదేశాలు మాత్రం కాదని.. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తంగా ఇప్పటి వరకు పునరుద్ధరించిన ఓట్లు కేవలం 2 నుంచి 3 వందల ఓట్లు మాత్రమే మిగిలిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారు. ఇదే ఇప్పుడు బెంగాల్ భవితవ్యాన్ని మార్చేస్తుందన్న చర్చ సాగుతోంది.