ముగిసిన డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విమాన ప్రమాదంలోనే మృతి!
గుజరాతీ సినీ డైరెక్టర్ మహేష్ జీరావాలా మిస్సింగ్ మిస్టరీ వీడింది. అది కాస్తా తీవ్ర విషాదంగా ముగిసింది.;
గుజరాతీ సినీ డైరెక్టర్ మహేష్ జీరావాలా మిస్సింగ్ మిస్టరీ వీడింది. అది కాస్తా తీవ్ర విషాదంగా ముగిసింది. ఆహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అతని మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. ఈ విషయాలను అధికారులు తాజాగా వెల్లడించారు. దీంతో.. తీవ్ర విషాదం నెలకొంది!
అవును... మహేష్ జీరావాలా అలియాస్ మహేష్ కలవాడియా అనే గుజరాత్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.. జూన్ 12న ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు కాదు.. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉండే విద్యార్థి కాదు. అయినప్పటికీ.. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందారు.
వివరాళ్లోకి వెళ్తే... అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాప్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారిలో 241 మంది బయట కనీసం 33 మంది మరణించారు! డీఎన్‌ఏ ద్వారా మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి మహేష్ జీరావాలా కనిపించడం లేదు! ఆ రోజు విమానాశ్రయం సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లినట్లు అతని భార్య తెలిపారు. ఇదే సమయంలో... ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో అతని ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని మృతదేహం మాత్రం లభించలేదు.
దీంతో... ఈయన మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మరోవైపు... ఈ విమాన ప్రమాదంలో మహేష్ మరణించి ఉంటారని తొలుత పోలీసులు భావించినట్లు చెబుతున్నారు. దీంతో.. అక్కడ దొరికిన మొబైల్, స్కూటర్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే.. అందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం అంగీకరించలేదు.
అయితే... శాస్త్రీయ నిర్ధారణ కోసం కుటుంబ సభ్యుల డీఎన్ఏ సేకరించిన, మృతదేహం డీఎన్ఏ తో పోల్చి చూడగా.. రిపోర్ట్ లో ఆ మృతదేహం మహేష్ దేనని తేలింది. దీంతో.. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూలబడిపోయారు! అలా డైరెక్టర్ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది.