కదులుతున్న స్లీపర్ బస్సులో డెలివరీ.. వస్త్రంలో చుట్టి విసిరేసిన తల్లి
అవును.. సున్నిత మనస్కులు ఈ కథనాన్ని చదవకుండా ఉండటమే మంచిది. అలాంటి వారి మనసుల్ని చేదుగా మార్చటమే కాదు.. తీవ్రమైన వేదనకు గురి చేసే అంశంగా దీన్ని చెప్పాలి.;
అవును.. సున్నిత మనస్కులు ఈ కథనాన్ని చదవకుండా ఉండటమే మంచిది. అలాంటి వారి మనసుల్ని చేదుగా మార్చటమే కాదు.. తీవ్రమైన వేదనకు గురి చేసే అంశంగా దీన్ని చెప్పాలి. మనిషిలో అంతకంతకూ తగ్గుతున్న భావోద్వేగాలే కాదు.. మమత.. బంధాలకు ఇవ్వాల్సిన విలువ.. అన్నింటికి మించి అత్యంత విలువైనదిగా చెప్పే మాతృప్రేమకు భిన్నంగా.. కసాయి సైతం నోట మాట రాలేని రీతిలో ఉన్న ఈ అమానవీయ ఉదంతంలోకి వెళితే..
మహారాష్ట్రలోని పర్ బాణీ జిల్లాకు చెందిన 19 ఏళ్ల రితికా ధేరే.. తన భర్త అల్తాఫ్ షేక్ తో పాటు ఫూణె నుంచి పర్ బాణీకి స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తోంది. నిండు గర్భవతి అయిన ఆమె.. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో కదులుతున్న బస్సులో డెలివరీ అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే.. ఆ పసికందును ఒక వస్త్రంలో చుట్టి బస్సు కిటికీలోంచి బయటకు విసిరేశారు. దీంతో బిడ్డ ప్రాణాలు పోయాయి.
ఏదో వస్తువును బయటకు విసిరేసినట్లుగా గుర్తించిన బస్సుడ్రైవర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటేశారు. రోడ్డు మీద పసికందును చూసి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బస్సును అడ్డుకున్నారు. దీంతో.. ఈ ఘోరం బయటకు వచ్చింది.తము బిడ్డనుపెంచే స్థోమత లేదని.. అందుకే వదిలేయాలని అనుకుంటున్నట్లుగా ఈ కసాయి తల్లిదండ్రులు పోలీలసుకు చెప్పారు. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతిని ఆసుపత్రిలో చేర్చి వైద్యసాయాన్ని అందిస్తున్నారు. మానవత్వం లేకుండా అప్పుడే పుట్టిన పసికందును అలా ఎలా పడేస్తారన్నది షాకింగ్ గా మారింది.