స్టార్‌ లింక్‌ తో ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని మొదటి రాష్ట్రం.. కీలక వివరాలివే!

భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ తన సేవలు మొదలుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా మాహారాష్ట్ర నిలిచింది.;

Update: 2025-11-06 07:04 GMT

భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ తన సేవలు మొదలుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రంగా మాహారాష్ట్ర నిలిచింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్టార్‌ లింక్‌ తో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది. దీనికి సంబంధించిన కీలక వివరాలు సీఎం వెల్లడించారు.

అవును... ఎలాన్ మస్క్ స్టార్ లింక్ తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఫలితంగా... మారుమూల, వెనుకబడిన ప్రాంతాలలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను మోహరించడానికి స్టార్‌ లింక్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది.

ఈ సందర్భంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్... రాష్ట్రాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌ కు ఈ సహకారం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ముంబైలో స్టార్‌ లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్‌ ను స్వాగతించడం చాలా అద్భుతంగా ఉందని.. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్‌ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసిందని తెలిపారు.

దీని ద్వారా ప్రభుత్వ సంస్థలు, గ్రామీణ సమాజాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి, నందూర్‌ బార్, ధరాశివ్, వాషిమ్ వంటి మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాల కోసం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అమలు చేయడానికి స్టార్‌ లింక్‌ తో అధికారికంగా సహకరించిన మొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపు పొందిందని ఫడ్నవీస్ అన్నారు.

ఇదే సమయంలో.. స్టార్ లింక్ భారతదేశానికి చేరుకోవడం, మహారాష్ట్రతో భాగస్వామ్యం చేసుకోవడం తమకు చాలా గౌరవంగా ఉందని.. మహారాష్ట్ర – స్టార్‌ లింక్ సహకారం రాష్ట్ర ప్రధాన డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌ కు మద్దతు ఇస్తుందని.. ఇది తీరప్రాంత అభివృద్ధి, విపత్తు స్థితిస్థాపకత కార్యక్రమాలతో అనుసంధానిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.

కాగా... డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్ అనుమతి పొందిన తర్వాత.. జూన్‌ లో స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.. భారతదేశంలో తక్కువ భూ కక్ష్య ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌ లింక్‌ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే ఈ అనుమతి.. స్టార్‌ లింక్ భారతదేశ ఉపగ్రహ ఇంటర్నెట్ మార్కెట్‌ లోకి ప్రవేశించడానికి వీలు కల్పించింది.

ఈ సమయంలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌ టెల్ వంటి ప్రస్తుత టెలికాం ఆపరేటర్లకు స్టార్‌ లింక్ ఎటువంటి పోటీ ముప్పును కలిగించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనంగా స్టార్‌ లింక్ టెర్మినల్ అధిక ముందస్తు ఖర్చు రూ.33,000 నుంచి రూ.35,000 మధ్య ఉంటుందని అంచనా వేయబడింది.

Tags:    

Similar News