టీడీపీ మహానాడు వాయిదా... చంద్రబాబు ఆలోచన ఏమిటి?

ఇందులో భాగంగా ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూటమే అని.. క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ఇటీవల వారణాసిలో చంద్రబాబు స్పందించారు.

Update: 2024-05-16 10:26 GMT

ఏపీలో ఈ నెల 13 వరకూ ఓ రకమైన చర్చ జరిగితే... పోలింగ్ పూర్తయిన తర్వాత సుమారు 20 రోజుల పాటు ఫలితాల కోసం వేచి చూడాల్సి రావడంతో మరోరకం చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా.. లేక, కూటమి సత్తా చాటుతుందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ విషయంలో ఎవరి ధీమా వారికుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూటమే అని.. క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ఇటీవల వారణాసిలో చంద్రబాబు స్పందించారు. ఇదే సమయంలో అధికారంలోకి కూటమి వస్తుంది.. 15 సీట్లకు తగ్గకుండా జనసేన గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు అంతే బలంగా చెబుతున్నారు. మరోపక్క... 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి బలంగా చెబుతున్నారు!

ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా వేస్తూ నిర్ణయించారు! అందుకు వారు చెబుతున్న కారణం... జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడిలో ఉండటమేనట. ఈ విషయాన్ని టెలీ కాన్ ఫరెన్స్ లో చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు సూచించారు.

అయితే... మహానాడు మాదిరిగానే అన్ని గ్రామాల్లోనూ ఎన్టీఆర్ కు నివాళి, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇదే సమయంలో.. తిరిగి మహానాడు ఎప్పుడు నిర్వహిచాలి..?, ఏయే తేదీల్లో నిర్వహించాలనే విషయాలపై మరోసారి ప్రకటన చేద్దామని బాబు తెలిపారు! దీంతో... ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందులో భాగంగా... గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న చంద్రబాబు & కో... మహానాడును వాయిదా వేయకుండా ఉండి ఉండాల్సిందని చెబుతున్నారు. ఫలితాల విడుదల తర్వాత జరిగే సంబరాలకంటే ముందు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఇది రికార్డ్ సృష్టించేదని అంటున్నారు. ఇక వైసీపీ నేతలైతే... మహానాడు వాయిదా వెనకున్న అర్ధం అందరికీ అర్ధమవుతుందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News