మాగుంట సంచలన ప్రకటన...వారసుడు ఆయనే !

తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు.;

Update: 2025-10-17 03:30 GMT

తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. ఆయన అంతకు ముందు 2019 నుంచి 2024 దాకా వైసీపీ నుంచి ఈ పదవిలో కొనసాగారు. అంతకు ముందు కాంగ్రెస్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన కుటుంబం మొత్తం రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చినదే. మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా చేస్తే ఆయన హత్య తరువాత సతీమణి మాగుంట పార్వతమ్మ అదే సీటు నుంచి ఎంపీ అయ్యారు. ఇలా చూస్తే ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కుటుంబాన్ని దశాబ్దాలుగా పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ వస్తోంది అన్నది స్పష్టం.

రాజకీయ విరామం :

ఇవన్నీ పక్కన పెడితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదులు దాటిన వారు అవుతారు. దాంతో తన రాజకీయం ఇక చాలు అని ఆయన అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని కూడా మరో కీలక ప్రకటనను ఆయన చేయడం విశేషం.

యువ నేతగా :

ఇక మాగుంట రాఘవరెడ్డి యువనేతగా ఉంటూ వస్తున్నారు. తండ్రికి రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వైసీపీలో ఉన్నపుడే ఆయన పోటీ చేయాల్సింది అని ప్రచారంలో ఉంది. ఇపుడు పార్టీ మారింది అంతే తేడా అంటున్నారు. అయితే ఒంగోలు పార్లమెంట్ చరిత్ర చూస్తే టీడీపీ ఇక్కడ గెలిచింది తక్కువ సార్లే అని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి పట్టు ఎక్కువ అని చెబుతారు.

గెలిచింది మూడు సార్లే :

ఇక తెలుగుదేశం ఏర్పాటు అయ్యాక 1984లో తొలిసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే బెజవాడ పాపిరెడ్డి గెలిచారు. ఆ తరువాత మళ్లీ 1999లో టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అంటే 2024లో టీడీపీ గెలిచింది. ఇక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. వైసీపీ రెండు సార్లు గెలిచింది. దాంతో వైసీపీకి ఇక్కడ బలం చాలా ఉంది అని అంటున్నారు. అంతే కాదు రెడ్లు అధికంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇదని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆ సామాజిక వర్గం బలం అన్నీ కలసి గతంలో కాంగ్రెస్ ని తరువాత కాలంలో వైసీపీని గెలిపిస్తూ వచ్చాయని చెబుతున్నారు. 2014లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలు అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

టఫ్ ఫైట్ ఖాయం :

ఇక 2029 లో ఒంగోలు నుంచి వైసీపీ తరఫున పోటీకి జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి రెడీ అవుతున్నారు. నిజానికి ఆయనకు 2024లోనే టికెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేకపోయారు కానీ 2029లో ఆయన పోటీ చేసి తీరుతారు అని అంటున్నారు. దాంతో ఆయనతో తలపడి మాగుంట రాఘవరెడ్డి గెలవాల్సి ఉంటుంది. పైగా సామాజిక వర్గ సమీకరణలు అన్నీ చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాగుంట ఫ్యామిలీలో కొత్త తరం పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం అయిపోయింది అన్న మాట.

Tags:    

Similar News