మాగంటి కుటుంబంలో వారసత్వ మంటలు
ఒక ఉప ఎన్నికను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. అంతే సీరియస్ గా ప్రతిపక్షం ఈ ఎన్నికల్ని టేకప్ చేయటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అందరికి కీలకంగా మారింది.;
ఒక ఉప ఎన్నికను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. అంతే సీరియస్ గా ప్రతిపక్షం ఈ ఎన్నికల్ని టేకప్ చేయటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అందరికి కీలకంగా మారింది. గెలుపే ధ్యేయంగా పని చేయటం కనిపిస్తోంది. ఇలాంటి వేళలో బీఆర్ఎస్ అభ్యర్థి.. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి సంబంధించిన బయటకు రాని సంచలన అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
మాగంటి మరణ వేళలో.. లీగల్ హైర్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న మాగంటి సునీత తీరును ప్రశ్నిస్తూ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. సునీత మాగంటి గోపీనాథ్ రెండో భార్యన్న విషయం ఇప్పుడు వెలుగు చూసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని.. మాగంటి మరణం తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ లో మొదటి భార్యకు ఎలాంటి సంబంధం లేదని.. అసెంబ్లీ జారీ చేసిన గుర్తింపు కార్డుల్లోనూ మాగంటి మొదటి భార్య వివరాలు.. ఆమె సంతానానికి అస్సలు సంబంధం లేదని.. పాతికేళ్లుగా కామ్ గా ఉండి ఇప్పుడే బయటకు రావాల్సిన అవసరం ఏముందని సునీత తరఫు లాయర్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మాగంటి మొదటి భార్య కుమారుడు కూడా సీన్లోకి వచ్చేశారు. తన తండ్రి మరణించిన వేళలో అంత్యక్రియలకు వస్తానంటే ఆపేశారని.. బెదిరింపులకు గురి చేశారన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు.. తన తండ్రితో తాను తరచూ మాట్లాడతానని.. తమ మధ్య చాటింగ్ జరిగేదని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.అంతేకాదు తన పేరు చివరన ఉన్న కొసరాజు ముందు నుంచే ఉన్నప్పటికి.. తన పాస్ పోర్టులో తన తండ్రి పేరు ఉందంటూ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకుగా పరిచయం చేసుకున్న తారక్ ప్రద్యుమ్న పేర్కొన్నారు.
విచారణకు హాజరైన మాగంటి కుమార్తె.. ఆమె లాయర్.. ఇటువైపున మాగంటి మొదటి భార్య కుమారుడు చందానగర్ తహసీల్దార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. ఇరు వర్గాల వారు దాఖలు చేయాల్సినఅన్ని పత్రాల్ని ఈ నెల 19 లోపు సమర్పించాలని.. దానిపై విచారణ జరిపి నవంబరు 25న తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను పక్కన పెడుతున్నట్లుగా తహసీల్దార్ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మాగంటి సునీతకు జూబ్లీహిల్స్ ఉపపోరు మాత్రమే కాదు అంతకు మించిన ఇంటిపోరు ఎదురైందని చెప్పక తప్పదు. మరి.. ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్న. అదే సమయంలో సునీతకు ఎదురయ్యే సవాళ్లు ఏమేం ఉంటాయన్న దానిపై ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది.