గోపీనాథ్ మరణంపై అనుమానాలు.. పోలీసులకు మాగంటి తల్లి ఫిర్యాదు
గోపీనాథ్ కొన్ని నెలల వైద్య పరీక్షల ఫలితాల్ని గమనిస్తే.. తరచూ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లుగా ఇటీవల తాను గుర్తించినట్లుగా పేర్కొన్నారు.;
హోరాహోరీగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ.. శనివారం రాత్రి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే తన వ్యాఖ్యలతోకొత్త సంచలనానికి తెర తీసిన మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి తాజాగా రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేశారు. గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళలో.. తన కొడుకును చూసేందుకు వెళితే అనుమతి నిరాకరించారని.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను అనుమతించారని పేర్కొంటూ చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
మాగంటి గోపీనాథ్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని.. వైద్యం అందించటంలో జరిగిన నిర్లక్ష్యం వల్లనే తన కొడుకు చనిపోయారని.. మరణాన్ని ధ్రువీకరించటంలోనూ జాప్యం జరిగిందన్నారు. గోపీనాథ్ అనుమానాస్పదంగా మరణించారన్న ఆమె.. ‘మరణానికి ముందు నా కొడుకు అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడ్డాడు. 2025జూన్ ఐదున గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తర్వాత గోపీనాథ్ కుమార్తె దిశిర సంతకం చేసిన ఒక లేఖ ఆధారంగా నా కొడుకును చూసేందుకు భద్రతా సిబ్బంది నన్ను అనుమతించలేదు’’ అని పేర్కొన్నారు.
గోపీనాథ్ కొన్ని నెలల వైద్య పరీక్షల ఫలితాల్ని గమనిస్తే.. తరచూ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లుగా ఇటీవల తాను గుర్తించినట్లుగా పేర్కొన్నారు. తన కొడుకుతో ఉండేవారు.. సకాలంలో వైద్యం అందించకపోవటంతో ఆరోగ్యం క్షీణించిందన్న ఆమె.. డయాలసిస్ చేయటంలో జాప్యం.. మూత్రపిండాల తొలగింపు తర్వాత తీసుకున్న నిర్ణయాలు మరణానికి కారణమన్నారు. మరణానికి దారి తీసిన పరిణామాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలన్న ఆమె ఫిర్యాదు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తన ఫిర్యాదుతో పాటు.. ఏఐజీ ఆసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షల ఫలితాలు.. చికిత్స వివరాలకు సంబంధించిన కొన్ని పత్రాల్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు.. జత చేసినట్లుగా చెబుతున్నారు.