లోకేష్ పాదయాత్ర ఇప్పట్లో లేనట్లేనా?

ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం కంటే.. వాయిదా వేయడమే బెటర్ అని పలువురు నేతలు సూచిస్తున్నారంట.

Update: 2023-09-28 08:58 GMT

ఈ నెల 9వ తేదీ ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయానికి లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని పొదలాడ వద్ద ఉన్నారు. ఆ సమయంలో తండ్రి అరెస్ట్ సమాచారంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ విజయవాడకు బయలుదేరారు. నాటి బ్రేక్ అలానే ఉండిపోయింది.

అనంతరం చంద్రబాబును కోర్టులో హాజరుపరచడం, కోర్టు బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం తెలిసిందే. దీంతో నాటి నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల ఉంటే... బయట ఆయన బెయిల్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నారు! ఇందులో భాగంగా సుమారు రెండువారాలుగా ఢిల్లీలోనే ఉన్నారు! ఈ సమయంలో ఈ నెల 29 రాత్రి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని పార్టీవర్గాలు ప్రకటించాయి.

ఈ సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన మెంట్ కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు లోకేష్. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం కంటే.. వాయిదా వేయడమే బెటర్ అని పలువురు నేతలు సూచిస్తున్నారంట.

చంద్రబాబు పిటిషన్ లపై న్యాయవాదులతో సమాలోచనలు చేయడం, తన ముందస్తు బెయిల్స్ గురించి ఆలోచించుకోవడం బెటరని అంటున్నారట. దీనికోసం మరో వారం రోజులపాటు పాదయాత్రను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారంట. అయితే రేపు ఉదయం నంద్యాలలో పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. దీంతో... పాదయాత్రపై ఆ భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఈ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్నారు నారా లోకేష్. ఈ సమావేశంలో ముఖ్యంగా లోకేష్ కు ముందస్తు బెయిల్ రానిపక్షంలో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు, అనుచరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News