చంద్రబాబును డామినేట్ చేసిన లోకేశ్

సీఐఐ సమ్మిట్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి వంటివారితో కలిసి మీడియాతో మాట్లాడారు.;

Update: 2025-11-24 04:15 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ డామినేట్ చేస్తున్నారా? అంటే ఔననే అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్న లోకేశ్.. మిగిలిన మంత్రుల కంటే భిన్నంగా తన తండ్రి వద్ద ఉన్న చనువుతో కొన్ని సందర్భాల్లో ఆయనను వెనక్కి నెట్టేలా దూకుడు ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నా.. ఇటీవల నిర్వహించిన సీఐఐ సమ్మిట్ లో చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన నుంచి మైక్ తీసుకున్న లోకేశ్ ప్రభుత్వంలో తన ఆధిక్యతను ప్రదర్శించేలా వ్యవహరించారని అంటున్నారు.

సీఐఐ సమ్మిట్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి వంటివారితో కలిసి మీడియాతో మాట్లాడారు. అప్పట్లో జరిగిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ప్రభుత్వంలో విశాఖ వేదికగానే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సందర్భంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేయగా, లోకేశ్ జోక్యం చేసుకుని తాను సమాధానం చెబుతానని మైక్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు ఆ హోదాలో ఎవరు ఉన్నా మంత్రులు మాట్లాడే ప్రయత్నం చేయరని అంటున్నారు. ముఖ్యమంత్రులు మాట్లాడితే తాము ఎదైనా చెప్పాల్సివస్తే వారు మాట్లాడిన తర్వాతే మంత్రులు తమ వాదన వినిపిస్తుంటారు. కానీ, లోకేశ్ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక్క మాట కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా తనే జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే సీఎం చంద్రబాబు కుమారుడు కావడం వల్లే ఆయనకు ఆ వెసులుబాటు వచ్చిందని, ఇది ప్రభుత్వంలో లోకేశ్ డామినేషన్ ను తెలియజేస్తోందని అంటున్నారు.

జర్నలిస్టు ప్రశ్నపై స్పందిన లోకేశ్.. ప్రభుత్వం ఎప్పుడూ కొనసాగుతుందని, పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరంటూ చెప్పడమే కాకుండా, గత ప్రభుత్వంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు వస్తామంటే ప్రోత్సహిస్తామని, వాటికి అన్ని రకాలుగా సహరిస్తామని చెప్పడం ద్వారా తనలో పరిపక్వతను చాటుకున్నారని కూడా అంటున్నారు. అయితే లోకేశ్ మాట్లాడటానికి ముందు చంద్రబాబు జర్నలిస్టు నుంచి ఎదురైన ప్రశ్నపై ఎదురుదాడి చేసినట్లు కనిపించిందని అంటున్నారు. రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న ప్రశ్నపై మాట్లాడిన చంద్రబాబు ‘ఎక్కడైనా ఉంటే వెతుక్కోవాలి?’ అని వ్యాఖ్యానించగా, లోకేశ్ కల్పించుకుని గత ప్రభుత్వ నిర్ణయాలను తాము అనుసరిస్తామని చెప్పడం విశేషంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ చిన్న వీడియో ద్వారా ప్రభుత్వంలో తన పవర్ ను లోకేశ్ ఆవిష్కరించారని కూడా అంటున్నారు.



Full View


Tags:    

Similar News