చంద్రబాబుకు చాలెంజ్ చేసిన మంత్రి నారా లోకేశ్
మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమం కింద మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్న మంత్రి లోకేశ్.. శుక్రవారం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.;
ఏపీ ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబుకు మంత్రి నారా లోకేశ్ చాలెంజ్ చేశారా? ఈ విషయాన్ని మంత్రి లోకేశే చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబు కన్నా, మంగళగిరిలో తాను ఒక శాతం వెనకబడ్డానని, ఆ సమయంలో తాను చంద్రబాబుతో ఒక చాలెంజ్ చేశానని లోకేశ్ తాజాగా వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ కన్నా తాను ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటానని చాలెంజ్ చేస్తే మంగళగిరి ఓటర్లు ఎవరూ ఊహించని విధంగా 91 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి తనకు అండగా నిలిచారని వ్యాఖ్యానించారు.
మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమం కింద మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్న మంత్రి లోకేశ్.. శుక్రవారం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2019 ఎన్నికలకు ముందు కేవలం 21 రోజుల వ్యవధిలో తాను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ రోజు వేదికపై ఉన్న పెద్దలు కానీ, మంగళగిరి ఓటర్లు అయిన మీరు కానీ నాకు పరిచయం లేదని, ఆ కారణంగానే కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు. ఫలితాలు వచ్చిన మరునాడు తీవ్ర బాధను అనుభవించానని చెప్పిన మంత్రి లోకేశ్.. ఆ బాధ, ఆవేదన తనలో కసిని పెంచిందని చెప్పారు. 2019-24 మధ్య తాను ఎమ్మెల్యే కాకపోయినా, తమ పార్టీ అధికారంలో లేకపోయినా మంగళగిరి వాసుల కోసం సొంత డబ్బు వెచ్చించి 26 రకాల కార్యక్రమాలు అమలు చేసినట్లు చెప్పారు.
మంగళగిరికి ప్రభుత్వమే మంచినీటిని సరఫరా చేయకపోతే తాను తన సొంత ఖర్చుతో ఆర్వో ప్లాంట్లను పెట్టించానని, యువత కోసం క్రీడా పోటీలు, మహిళలకు టైలరింగులో శిక్షణతోపాటు వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో నివసిస్తున్నాను, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నానని ఆ కారణంగానే మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించానని చెప్పారు. గత ఎన్నికల ముందు రెండు చోట్ల పోటీ చేయమని తన సహచరులు చెప్పారని, కానీ ఐదేళ్లు కష్టపడి పనిచేసిన మంగళగిరిలో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశానని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో 50 వేల మెజార్టీ ఇమ్మని ప్రజలను కోరితే మంగళగిరి వాసులు తనకు 91 వేల మెజార్టీ కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా తనను గెలిపించడం గర్వంగా ఉందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మన ఇల్లు - మన లోకేశ్ కార్యక్రమం కింద గత నాలుగు రోజులుగా సుమారు వెయ్యి మందికి మంత్రి లోకేశ్ పట్టాలు పంపిణీ చేశారు.