లోకేష్ కి బాబు గురువు...జగన్ కి ఎవరు ?
భారతీయ ధర్మంలో గురువుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు.;
భారతీయ ధర్మంలో గురువుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు. తల్లిదండ్రులతో పాటుగా సమాన స్థానం ఇచ్చారు అయితే తొలి గురువు బిడ్డకు తల్లిగా ఉంటుంది. ఇక తండ్రి తాను ఎదుగుతూ తనలా ఎదగమని బిడ్డకు చెప్పకనే చెబుతాడు. అలా తండ్రి రూపంలో ఇంట్లోనే ఎవరికైనా గురువు ఉంటారు. ఇక తండ్రి అప్పటికే ఉన్న ప్రొఫెషన్ నే కుమారుడు ఎంచుకున్నట్లు అయితే తండ్రి అసలైన గురు స్థాంలోకి వస్తాడు. అలా తన తండ్రి రాజకీయ రంగాన్ని ఎంచుకున్న లోకేష్ కి తన తండ్రే గురువుగా నిలిచారు. ఇదే విషయాన్ని ఆయన గురుపూజోత్సవం సందర్భంగా చెప్పారు.
నాన్న బాటలోనే :
తనకు అన్నీ నాన్నే అని వినమ్రంగా లోకేష్ చెప్పుకొచ్చారు. తన తండ్రి బాటలోనే తాను సాగుతున్నాను అన్నారు. తనకు అన్ని విధాలుగా చంద్రబాబు గురుత్వం ఉపకరించింది అని కూడా చెప్పారు. తనకు తండ్రి మాత్రమే కాకుండా ఒక గురువుగా నిలిచి బాబు ప్రోత్సహించారు అని లోకేష్ అన్నారు. అది నిజమే కూడా. బాబుని బయట నుంచి చూసే ఎంతో మంది ఆయన శిష్యులుగా చేరి ఉన్నత పీఠాలను అధిరోహించారు. అలాంటిది ఇంట్లోనే బాబు లాంటి వారిని ఉంచుకున్న లోకేష్ కి తండ్రి కంటే గొప్ప గురువు ఎక్కడ ఉంటారు అన్నది కదా ఆలోచించేది.
చేయి పట్టి మరీ నడిపిస్తూ :
చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ని తేవాలనుకున్నారా లేక లోకేష్ ఆసక్తిని గమనించి ప్రొత్సహించారా అన్నది తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం బాబు చేయి పట్టి మరీ లోకేష్ నడిపించారు అన్నది గత దశాబ్ద కాలంగా అంతా చూసిన విషయం. ఎప్పటికి ఏది అవసరమో అది అందిస్తూ సమయానుకూలంగా పదవులు ఇచ్చి నిలబెడుతూ చంద్రబాబు లోకేష్ కి ఒక రాజకీయ రహదానిని ఏర్పాటు చేశారు అని అంతా విశ్లేషిస్తారు. అయితే ఒక తండ్రిగా గురు స్థానంలో నిలిచి బాబు ఎంత చేసినా ఏమి చెప్పినా వాటిని పూర్తిగా గ్రహించి తన భవిష్యత్తుకి రాచబాట వేసుకోవడం అన్నది లోకేష్ సమర్ధతకు నిదర్శనం అని అంటారు. అలా బాబుకు తగిన శిష్యుడిగా లోకేష్ మారారు అని అంటున్నారు.
మరి జగన్ మాటేంటి :
ఇక్కడ సహజంగానే జగన్ ప్రస్తావనను కూడా అంతా తెస్తారు. ఎందుకంటే తెలుగు నాట రాజకీయాల్లో వైఎస్సార్ నారా కుటుంబాలు రెండూ అత్యంత ఫ్యామస్ కాబట్టి. వైఎస్సార్ రాజకీయ వారసుడిగానే జగన్ కూడా రాజకీయ అరంగేట్రం చేశారు అన్నది నిజం. 2009 ఎన్నికల్లో తన తండ్రి సీఎం గా ఉండగానే కడప లోక్ సభ సీటు నుంచి జగన్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అలా తండ్రి చలవతో ఆయన విలువతో జగన్ ఈ పదవిని అందుకున్నారు. అయితే రాజకీయంగా వైఎస్సార్ గురు స్థానంలో నిలిచి ఏ మేరకు బోధించారో తెలియదు కానీ జగన్ తొలిసారి ఎంపీగా మూడు నెలలు కూడా పూర్తి చేసుకోకుండానే వైఎస్సార్ దివంగతులయ్యారు. దాంతో జగన్ అన్నీ సొంతంగానే నేర్చుకోవాల్సి వచ్చింది అని అంటారు.
వైఎస్సార్ ప్రభావమెంత :
జగన్ మీద వైఎస్సార్ ప్రభావం ఎంత ఉంది అంటే ఆయన పేదలకు సీఎం గా అందించిన సంక్షేమ పధకాలలో అది కనిపిస్తుంది. ఆయన పాలనలో చాలా నిర్ణయాలు వైఎస్సార్ ప్రభావంతో తీసుకున్నవే అని చెప్పాల్సి ఉంటుంది. అలా గురువుగా వైఎస్సార్ మార్గ నిర్దేశం చేశారు అని భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ వ్యక్తిత్వం విషయంలో కానీ జగన్ తన సొంత పంధానే అనుసరించారు అని కూడా విశ్లేషిస్తారు. వైఎస్సార్ లో పట్టు విడుపు రెండూ ఉంటాయని అంటారు. జగన్ అయితే పట్టుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటారు. ఇక రాజకీయ వ్యూహాల్లో వైఎస్సార్ అందె వేసిన చేయిగా ఉంటారు. ఆయన అందరితో కలసి ఆలోచించి తాను అనుకున్న నిర్ణయం తీసుకుంటారు. జగన్ అయితే చాలా మటుకు సొంత నిర్ణయాలే తీసుకుంటారు అని ప్రచారంలో ఉన్న మాట. మొత్తం మీద చూస్తే జగన్ తనను తాను రాజకీయంగా తీర్చిదిద్దుకున్నట్లుగా కనిపిస్తారు. అందుకే జగన్ విధానం భిన్నంగా ఉంటుంది అంటారు.