మెస్సీతో ఫోటోనా...కాస్ట్లీ గురూ....

ప్రపంచ ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మన భాగ్యనగరానికి వచ్చి సందడి చేయబోతున్నాడని తెలిసి అభిమానులు మరింత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు;

Update: 2025-12-11 04:47 GMT

ప్రపంచ ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మన భాగ్యనగరానికి వచ్చి సందడి చేయబోతున్నాడని తెలిసి అభిమానులు మరింత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 13 సాయంత్రం మెస్సీ హైదరబాద్ లో అడుగుపెడతారు. ఫలక్ నూమా ప్యాలెస్ లో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. అతన్ని కలవాలని, అతనితో ఫొటో తీసుకోవాలని తెగ ఆరాటపడే అభిమానులకు మెస్సీతో కలిసి ఫొటో దిగే చాన్స్ నిర్వాహకులు కల్పించారు. అయితే ఫ్రీ కాదండోయ్...అక్షరాలా పది లక్షల రూపాయలు చెల్లించి ఏంచక్కా ఫొటో దిగొచ్చు. అబ్బో చాలా కాస్ట్లీ వ్యవహారమే అనుకుంటున్నారా? మెస్సీ అంటే మాటలు కాదు ...ఫ్రపంచ పుట్ బాల్ దిగ్గజంతో ఫొటో దిగాలంటే ఆ మత్రం ఖర్చవుతది మరి.

మెస్సీ హైదరాబాద్ పర్యటన వివరాలను ద గోటూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి మీడియాతో పంచుకున్నారు. మెస్సీతో ఫొటో దిగాలంటే రూ.9.5 లక్షలు జీఎస్టీతో కలిపి రౌండ్ ఫిగర్ పదిలక్షలు. అది కేవలం వంద మందికి మాత్రమే అని పార్వతిరెడ్డి స్పష్టం చేశారంటే మెస్సీ క్రేజీ మామూలు కాదని అర్థమవుతోంది. సామాన్య అభిమానులే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆటలో పాలుపంచుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటున్న మెస్సీ రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. మెస్సీతోపాటు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డీపాల్, ఉరుగ్వేకు చెందిన లూయిస్ సువారెజ్ రానున్నారు. ఈ సందర్భంగా సింగరేణి 9 తో అపర్ణ మెస్సి ఆల్ స్టార్స్ జట్టు మధ్య 20 నిమిషాల పాటు ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది. చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగుతారు. 15 మంది చిన్నారులు పాల్గొంటుండగా వారిలో 10 మంది ప్రతిభ ఉన్నా సరైన శిక్షణ అవకాశాలు లేని వారుంటారు. ఆట అనంతరం మెస్సీ చిన్నారులకు ఫుట్ బాల్ లో మెలకువలు నేర్పిస్తారు.

ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. అయితే ఈసారి ప్రపంచ కప్ విజేతగా రావడం విశేషం. మెస్సీ మూడు రోజులు పర్యటిస్తారు. మెస్సీని పట్టుబట్టి ఇండియాకు రప్పిస్తున్న ఘనత శతడ్రు దత్తాకే దక్కుతుంది. వెస్ట్ బెంగాల్ హుగ్లీ కి చెందిన శతడ్రు మెస్సీని ఇండియాకు రప్పించేందుకు రెండేళ్ళపాటు ప్రయత్నిస్తే ఇప్పటికి నెరవేరింది. స్పోర్ట్స్ మార్కెటింగ్, సెలిబ్రిటీ ఈవెంట్లు నిర్వహించడంలో అనుభవం ఉన్న శతడ్రు దేశంలో ఫుట్ బాల్ కున్న క్రేజీని గమనించి ప్రపంచ ఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుల్ని ఇక్కడికి రప్పిస్తున్నారు. గతంలో బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే, అర్జంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాను భారత్ కు రప్పించగలిగారు. సో హైదరాబాద్ కు మెస్సీ వస్తున్నారు... ఫొటో దిగాలనుందా...అయితే పదిలక్షలు సిద్ధం చేసుకోండి.

Tags:    

Similar News