రాజ్యసభకు లింగమనేని.. ఫస్ట్ రియాక్షన్ ఇదే!
జనసేన పార్టీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి .. లింగమనేని రమేష్.. శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి .. లింగమనేని రమేష్.. శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం.. ఆయన మీడియాతో మాట్లా డుతూ.. తనకు అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణ పడి ఉంటానన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఇద్దరు పెద్దనేతలు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు బలపరిచార ని వారికి కృతజ్ఞతలని పేర్కొన్నారు.
రాష్ట్రం తరఫున ముఖ్యంగా అమరావతి రాజధాని తరఫున తన గళం పార్లమెంటులో వినిపిస్తానని రమేష్ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. మరింత మందికి ఉపాధి,ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడి సూచనలు, సలహాలను తప్పకుండా పాటిస్తానన్నారు. ప్రతి విషయంలోనూ ఏపీకి మేలు జరిగేలా వ్యవహరిస్తానని తెలిపారు. రాజధాని నిర్మాణానికి తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.
రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కల్యాణ్ సూచనల మేరకు పనిచేస్తానని రమేష్ వ్యాఖ్యానించారు. ఇది తనకు రాజకీయంగా తొలి అనుభవమే అయినప్పటికీ పెద్దల సూచనలతో అనుకున్నది సాధిస్తానన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఆయన.. వాటిని పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో తాను కూడా భాగం అవుతానని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు.
అమరావతికి ప్రయోజనం!
రాజధాని అమరావతికి రమేష్ ప్రాతినిధ్యం ఎంతో ఉపయోగపడనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నా యి. రాజధాని ప్రాంతం నుంచి ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభలో గుంటూరు ఎంపీ, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరా యులు ఉన్నారు. ఇప్పుడు రమేష్ రాజ్యసభ సభ్యుడిగా అడుగు పెడితే.. ఆయన ద్వారా రాజధానికి సంబంధించిన సమస్యలు మరిన్ని త్వరగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని కూటమి నాయకులు చెబుతున్నారు.