జీవితమే అసలైన గురువు
ఒక ఫైవ్ కొట్టు గురూ అని సరదాగా ఒక కమెడియన్ చేసే కామెడీ వెనకటి సినిమాల్లో ఫ్యామస్. అలా గురూ అన్నది ఎంత తేలిక పదంగా మార్చినా గురువు అంటే బరువుతో కూడున్నదే;
ఒక ఫైవ్ కొట్టు గురూ అని సరదాగా ఒక కమెడియన్ చేసే కామెడీ వెనకటి సినిమాల్లో ఫ్యామస్. అలా గురూ అన్నది ఎంత తేలిక పదంగా మార్చినా గురువు అంటే బరువుతో కూడున్నదే. బాధ్యతతో కూడుకున్నదే. గురువు లేకుండా పాఠాలు నేర్చే వారు ఉండరు. అయితే ఎదురుగా గురువు నిలిచి ఏదీ బోధించ నక్కరలేదు. ఏకలవ్యుడు బొమ్మనే గురువుగా చేసుకుని ద్రోణుని నుంచి పాఠాలు అద్భుతంగా నేర్చుకున్నారు. అక్కడ బొమ్మ ఉన్నా మనసులో గురువు ఉన్నారు. అలా జీవితంలో ఎందరో ఏకలవ్య శిష్యులు ఉన్నారు. మనిషి జీవితం తీసుకుంటే గురువు ఎక్కడో లేడు అడుగడుగునా కనిపిస్తారు. ప్రతీ సవాల్ లో గురువు ఉంటే చెప్పే జవాబులోనే పాఠాలు నేర్చి అప్పగించాల్సి ఉంటుంది.
గుణ పాఠాలు ఎన్నెన్నో :
మనిషి జీవితంలో ప్రతి మైలు రాయి వద్ద బండ రాళ్ళు చాలానే ఉంటాయి. వాటిలో కాళ్ళకు అడ్డం పడేవి కొన్ని అయితే కాలికే గాయం చేసి రక్తాలు చూసేవి మరి కొన్ని. అలాంటి రాళ్ళను జాగ్రత్తగా అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగి విజేతలు అయిన ఆరు ఉన్నారు. ఆ రాళ్ళనే ఒక్కోటిగా పేర్చుకుని చక్కటి ఇల్లు కట్టుకుని బంగారు భవిష్యత్తుని అందుకున్న వారూ ఉన్నారు. ఈ ముళ్ళూ రాళ్ళూ చెప్పే పాఠాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గురువులు వాటి రూపంలోనూ ఉంటారు. అలా గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకుంటే ఉత్తమమైన శిష్యులుగా మారి అద్భుతమైన జీవితాన్ని ఎవరైనా చూస్తారు.
ఎన్నో అవకాశాలు ఇస్తూ :
బడిలో పాఠాలు చెప్పే గురువు పాఠాలు చెప్పి ప్రశ్నలు అడుగుతాడు. వాటికి మార్కులు వేస్తాడు. అది ఒక అందమైన విధానం. ఒక విధంగా పూల పానుపు లాంటి విధానం. కానీ జీవితంలో సమస్యల రూపంలో కష్టాల రూపంలో ఇబ్బందులలో రూపంలో ఎదురయ్యే ప్రశ్నలకు ఏ పుస్తకాలలోనూ జవాబులు ఉండవు. వాటిని ఎవరి శక్తి స్థాయి మేరకు వారే వెతుక్కుని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే చదువుల పాఠశాలలో ఒక స్థాయి వరకే బోధన ఉంటుంది. మెదడుకు మాత్రమే మేత ఉంటుంది. అవకాశాలు ఒక దశ వరకే ఉంటాయి. కానీ జీవితంలో మాత్రం ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తూంటారు. ఇక్కడ ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ నిలిచి గెలిచేందుకు అవకాశం ఉంటుంది. జీవితాన్ని మార్పు చేసుకుని ముందుకు సాగేందుకు వీలు ఉంటుంది.
జీవితమంతా శిష్యరికమే :
ఎవరైతే నిత్య విద్యార్ధిగా ఉంటారో వారు బతుకు పాఠశాలలో మంచి మార్కులతో రాణిస్తారు. అంతా నాకే తెలుసు అన్నీ నేనే అనుకున్న వారు బొక్క బోల్తా పడతారు. జీవితం అన్నది చిన్నది అన్నది గుర్తు ఎరిగిన వారు తాము ఈ విశాల ప్రపంచంలో ఎంతో చిన్న వారమని గ్రహించిన వారు తాము తెలుసుకున్నది గోరంత నేర్వాల్సింది కొండంత అని భావించిన వారు మంచి శిష్యులుగా ఉంటూ మనుగడ సాగిస్తారు. అదే సమయంలో తల తిక్కతో వ్యవహరించే వారికి మాత్రం జీవితంలో బెత్తం దెబ్బలు కొట్టే గురువులు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటారు. బుద్ధిగా జీవిత పాఠాలను నేర్చుకుంటేనే ఒడ్డు చేరుకునేది అన్న సత్యాన్ని ఎరిగిన వారికి మాత్రం బతుకు పాఠశాల కూడా బంగారం గానే తోస్తుంది. భావి కూడా బాగానే ఉంటుంది. ఇది నిత్య సత్యం. ఇదే అక్షర సత్యం కూడా.