పార్టీని కొడుక్కి అప్పచెప్పిన లాలూ...కూతురు రివర్స్ !

అయితే అందరిలో చిన్న కుమారుడికే ఆయన ఓటు వేశారు. ఎనభై ఏళ్ల వయసులో ఉన్న లాలూకు మూడున్నర పదుల వయసులో ఉన్న తేజస్వి యాదవ్ మాత్రమే సిసలైన వారసుడిగా కనిపించారు.;

Update: 2026-01-26 04:17 GMT

లాలూ ప్రసాద్ యాదవ్, దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన రాజకీయ ప్రస్థానం 1975 ఎమర్జెన్సీ నుంచి స్టార్ట్ అయింది. రాం మనోహర్ లోహియా శిష్యుడిగా లాలూ ఉన్నారు. ఆ తరువాత ఎమెర్జెన్సీ టైం లో లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ అడుగు జాడలలో నడిచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన బీహార్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చారు. 1990 దశకం వచ్చేసరికి మండల్ నినాదాల మధ్య బీహార్ రాజకీయం పూర్తిగా మారింది. అప్పటివరకూ అగ్ర వర్ణాల చేతులలో ఉన్న సీఎం పోస్టు కాస్తా బీసీల పరం అయింది.

బలమైన నేతగా :

అలా బీహార్ రాజకీయాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవుల నుంచి బలమైన నాయకుడిగా ఎదిగిన లాలూ సీఎం అయ్యారు. ఆ తరువాత జనతాదళ్ చీలిపోవడంతో ఆర్జేడీని స్థాపించారు. ఆయన సీఎం గా ఆరేళ్ల పాటు పాలించారు. తన తరువాత తన సతీమణి రబ్రీదేవిని సీఎం పీఠం ఎక్కించారు. అలా ఆమె పదకొండేళ్ల పాటు పాలనను అందించారు. ఇక లాలూ వారసుడిగా చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ నిలిచారు. లాలూకు కుమార్తెలు కుమారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే అందరిలో చిన్న కుమారుడికే ఆయన ఓటు వేశారు. ఎనభై ఏళ్ల వయసులో ఉన్న లాలూకు మూడున్నర పదుల వయసులో ఉన్న తేజస్వి యాదవ్ మాత్రమే సిసలైన వారసుడిగా కనిపించారు. దాంతో తన వయసు అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పరంగా కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించేశారు.

నియామక పత్రం అందచేత :

పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు సీనియర్ల సమక్షంలో జరిగిన ఆర్జేడీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తేజస్వి యాదవ్ కి లాలూ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రబ్రీ దేవి ఇతర సీనియర్ నేతలు అంతా హాజరయ్యారు. దాంతో ఇక మీదట పార్టీ మొత్తం వ్యవహారాలు అన్నీ తేజస్వి యాదవ్ చూసుకుంటారు. తేజస్వి యాదవ్ పార్టీని 2020 ఎన్నికల్లో బీహార్ లో అతి పెద్ద పార్టీగా నిలబెట్టారు. కొంతకాలం ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రభుత్వంలో పనిచేశారు. ఆ మీదట ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి పాలు అయింది. దాంతో విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఉన్నారు. ఆయన సారధ్యంలో పార్టీ మళ్ళీ పుంజుకుంటి అన్న విశ్వాసంతోనే లాలూ పార్టీని ఆయనకు అప్పగించారు అని అంటున్నారు.

కూతురు విమర్శలు :

ఇదిలా ఉంటే లాలూ కుటుంబంలో ఒక వైపు విభేదాలు పెరిగి పెద్దవి అవుతున్నాయి. కుమార్తెలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తమకు సరైన ప్రాధాన్యత లేదని వారు అంటున్నారు. ఈ క్రమంలో లాలూ పెద్ద కుమార్తె రోహిణి ఆచార్య తన తమ్ముడు పార్టీ కొత్త నేత తేజస్వి యాదవ్ మీద తీవ్ర విమర్శలు చేశారు అణగారిన వర్గాల కోసం ఆర్జేడీని స్థాపిస్తే దానిని కొందరు వ్యక్తులు పూర్తిగా నాశనం చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. పార్టీ కొందరు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్ళిందని అన్నారు. పార్టీని నాశనం చేస్తున్న వారిని కార్యకర్తలే ప్రశ్నించాలని ఆమె అంటున్నారు. మొత్తానికి లాలూ తన వారసుడు ఎవరో నిర్ణయించేశారు. ఇక మీదట ఆర్జేడీ అంటే తేజస్వి యాదవ్ నే అని అంటున్నారు. ఆయన కూడా తండ్రి మాదిరిగానే పార్టీని సమర్ధంగా నడిపిస్తారు అని క్యాడర్ లో ఒక ఆశాభావం ఉంది.

Tags:    

Similar News