బీహార్ ని శాసించిన ఇద్దరు మిత్రుల కధ !
ఆ ఇద్దరూ మంచి మిత్రులు. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కలసి ఎదిగారు. కలసి పనిచేశారు. అనుకున్న విధంగా అధికారాన్ని వారు అందుకున్నారు.;
ఆ ఇద్దరూ మంచి మిత్రులు. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కలసి ఎదిగారు. కలసి పనిచేశారు. అనుకున్న విధంగా అధికారాన్ని వారు అందుకున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు బీహార్ ని గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో సుదీర్ఘ కాలం పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్. ఈ ఇద్దరూ జిగినీ దోస్తులు. దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులు అంటే 1975లో చాలా మంది యువత నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలా విద్యార్ధి ఉద్యమాల నుంచి వచ్చిన వారే లాలూ. నితీష్. ఈ ఇద్దరూ రాం మనోహర్ లోహియా భావ జాలాన్ని ఎక్కువగా ఆకర్షితులు అయి రాజకీయంగా ముందుకు సాగారు. అలాగే జయ ప్రకాష్ నారాయణ్ ని స్పూర్తితో రాజకీయంగా తమ దారులు ఎంచుకున్నారు.
ముందు సీఎం అయిన లాలూ :
ఇక ఈ ఇద్దరూ జనతా పార్టీలో మొదట ఉన్నారు. ఆ తరువాత జనతాదళ్ గా అది ఏర్పడితే అందులో కూడా కొనసాగారు. ఇక లాలూ ఎంపీగా గెలిచిన తరువాత పూర్తిగా బీహార్ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. ఆయనకు తెర వెనక మంచి మిత్రుడుగా ఉంటూ సహాయం చేసిన వారు నితీష్ కుమారు. 1990లో లాలూ తొలిసారి సీఎం అయ్యారు. ఆయన వెనక వ్యూహకర్తగా పనిచేసింది నితీష్ కుమార్. సీఎం అయిన తరువాత కొన్నాళ్ళ వరకూ బాగానే ఉన్న ఈ ఇద్దరు మిత్రులు తరువాత దూరం కావడానికి కారణం లాలూ అధికారంలో ఉంటూ నితీష్ ని తక్కువ చేయడమే అని అంటారు. నితీష్ పరిపాలనకు సంబంధించి ఇచ్చిన ఎన్నో సలహాలు లాలూ పట్టించుకోలేదు సరికదా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసేవారు అని అంటారు.
కుల పరంగానూ :
అదే సమయంలో లాలూ తన సొంత సామాజిక వర్గం యాదవులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది నితీష్ వర్గంలో కలగడంతో 1994లో కూర్మీ చేతన ర్యాలీని పాట్నాలో నిర్వహించారు. కోయిరీ కూర్మీ సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఆ వర్గాలకు నాయకుడిగా ఎదిగారు. అనంతరం జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో జనతాదళ్ యునైటెడ్ అన్న పార్టీని స్థాపించి ఎన్డీయేకు వాజ్ పేయ్ కి దగ్గర అయ్యారు అలా కేంద్రంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన బీహార్ కి తొలిసారి ముఖ్యమంత్రి అయింది 2003లో. ఏడు రోజుల పాటు పాలించారు. కానీ 2005 నుంచి మాత్రం ఈ రోజు వరకూ సీఎం గా కొనసాగుతూనే ఉన్నారు. మధ్యలో కొద్ది కాలం ఆయన తన పదవికి రాజీనామా చేసి మాంజీకి చాన్స్ ఇచ్చారు.
లాలూ ఫ్యామిలీతో :
లాలూ ఫ్యామిలీతో రాజకీయంగా విభేదిస్తూ వచ్చిన నితీష్ తనదైన పాలనతో జనాలను మెప్పించారు. నిజాయితీపరుడిగా పేరు గడించారు. లాలూ బీహార్ కి అయిదేళ్ళు పాలిస్తే ఆయన సతీమణీ రబ్రీదేవి పదేళ్ళు పాలించారు. నితీష్ ఆ ఇద్దరి కంటే ఎక్కువగా ఏకంగా ఇరవై ఏళ్ళ పాటు పాలించి బీహార్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు నాడు తండ్రితో పోటీ పడిన లాలూ 2029 ఎన్నికల నుంచి కొడుకు తేజస్వితో పోటీ పడుతున్నారు. అయినా నాటౌట్ అంటున్నారు. ఈసారి ఎన్నికలు నితీష్ భవిష్యత్తుని తేల్చేసేవే అని అంటున్నారు. గెలిచినా మరోసారి సీఎం అవుతారా బీజేపీ చేస్తుందా అన్నది ఒక చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా లాలూ నితీష్ బీహార్ బ్రదర్స్ గా పేరు గడించారు. రాజకీయం మాత్రం వారి మధ్య చిచ్చు పెట్టింది.