గ్యాంగ్‌స్టర్ దావూద్ బెదిరింపుల వల్లే క్రికెట్‌కు దూరమయ్యా.. లలిత్ మోదీ షాకింగ్ నిజాలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోదీ తొలిసారిగా ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోదీ తొలిసారిగా ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం... అతడి నేర సామ్రాజ్యం డి కంపెనీ నుండి ఎదురైన ప్రాణభయమే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణమని వెల్లడించారు. `ఏఎన్ఐ`కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు వ్యతిరేకంగా తాను తీసుకున్న కఠినమైన నిర్ణయాలు... దావూద్ నియంత్రణలో ఉన్న బిలియన్ డాలర్ల అండర్‌వరల్డ్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని దెబ్బతీశాయని.. అందుకే తాను మాఫియాకు ప్రధాన లక్ష్యంగా మారానని పేర్కొన్నారు.
లలిత్ మోదీ వివరణ ప్రకారం... అండర్‌వరల్డ్ మాఫియా నడిపే ఈ బెట్టింగ్ సామ్రాజ్యం ఊహకందని విధంగా చాలా విస్తృతమైనది. ఒకప్పుడు ప్రతి మ్యాచ్‌కు 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ అండర్‌వరల్డ్ బెట్టింగ్ మార్కెట్ నేడు ఒక్కో మ్యాచ్‌కు 4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 33 వేల కోట్లు) చేరిందని ఆయన వెల్లడించారు. ఈరోజుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వేరు. ఎవరూ పూర్తి మ్యాచ్ ని ఫిక్స్ చేయడం లేదు.. కేవలం బాల్స్ లేదా ఓవర్లను మాత్రమే ఫిక్స్ చేస్తున్నారని, దీనిని స్పాట్ ఫిక్సింగ్ అంటారని మోదీ తెలిపారు. మైదానంలో ఆటగాళ్లు రుమాలు బయటకు తీయడం లేదా ఒక నిర్దిష్ట పద్ధతిలో సైగలు చేయడం వంటి అత్యాధునిక సంకేతాల ద్వారా బుకీలకు సమాచారం అందిస్తారు! అని మోదీ పేర్కొన్నారు. తాను ఈ సంకేతాలను నిరంతరం నిఘా ఉంచి, మాఫియా ఇచ్చిన వందల మిలియన్ డాలర్ల లంచాలను తిరస్కరించడం వల్ల వారు తనపై కక్ష పెంచుకున్నారని చెప్పారు.
ఈ క్రమంలో 2012లో లండన్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనను లలిత్ మోదీ గుర్తుచేసుకున్నారు. ఒక లండన్ ఫిక్సర్ ద్వారా తెల్లవారుజామున 3:30 గంటలకు `బాబా` అనే ఒక మధ్యవర్తి పెంట్ హౌస్‌కు తనను పిలిపించారని, అక్కడ మాఫియా కోసం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని (టీమ్‌ను) కేటాయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ``నేను ఇండియాలోనే లేనని.. నాకేం సంబంధం అని చెప్పినప్పుడు.. ఆ మధ్యవర్తి టెర్రస్ పైకి వెళ్లి శాటిలైట్ ఫోన్ ద్వారా నేరుగా దావూద్ ఇబ్రహీంకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఫోన్‌లో దావూద్ మాట్లాడుతూ.. ``నువ్వు అతడి స్నేహితుడివి..పాతవన్నీ మర్చిపో.. అంతా అయిపోయిందని చెప్పాడు`` అంటూ మోదీ సంచలన విషయాలను బయటపెట్టారు.
మాఫియా మాట వినకపోవడంతో తనపైనా, తన కుటుంబంపైనా ప్రపంచవ్యాప్తంగా దాడులు ప్రారంభమయ్యాయని మోదీ ఆరోపించారు. ముంబై పోలీసులు ఈ గ్యాంగ్‌స్టర్ల సంభాషణలను రికార్డ్ చేసి తనకు అడగకుండానే రాత్రికి రాత్రే జెడ్- కేటగిరీ సెక్యూరిటీ కల్పించారని చెప్పారు. ముంబైలో నా ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి.. జోహన్నెస్‌బర్గ్‌లో నన్ను చంపడానికి స్కెచ్ వేశారు.. అలాగే మాంటినెగ్రోలో నాపై జరిగిన దాడి ప్రయత్నాన్ని క్రొయేషియా సరిహద్దులో ఆపగలిగారు. చివరికి లండన్ లోని స్లోన్ స్ట్రీట్ లో నా కొడుకును కూడా కిడ్నాప్ చేశారు! అని లలిత్ మోదీ తన భయానక అనుభవాలను షేర్ చేసారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ 2ను సౌతాఫ్రికాకు తరలించడం వల్ల భారీగా నష్టపోయిన మాఫియా.. తనను ఆ డబ్బు చెల్లించాలని బెదిరించిందని పేర్కొన్నారు.
ఈ ప్రాణసంకటమైన వివాదం చివరకు ఎలా ముగిసిందనే విషయమై స్పందిస్తూ.. అండర్‌వరల్డ్ టాప్ గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ ఒక లైవ్ ఇంటర్వ్యూలో ``లలిత్ మోదీతో మా సమస్యలు సర్దుమణిగాయి`` అని ప్రకటించడంతోనే ఈ గొడవ ఆగిందని చెప్పారు. అసలు మాఫియాతో ఏం సెటిల్మెంట్ అయిందనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను క్రికెట్ ప్రపంచం నుండి పూర్తిగా తప్పుకుంటానని వ్యక్తిగత హామీ ఇవ్వడం వల్లే తన ప్రాణాలు దక్కాయని మోదీ స్పష్టం చేశారు. నేను క్రికెట్ నుండి రిటైర్ అవుతానని వారికి మాట ఇచ్చాను. నేను ప్రభుత్వ ఒత్తిడిని, మీడియా ఒత్తిడిని భరించగలను కానీ... ప్రాణాలకే ముప్పు వచ్చే ఒత్తిడిని ఎందుకు భరించాలి? అందుకే శాశ్వతంగా తప్పుకున్నాను!! అని లలిత్ మోదీ ఇంటర్వ్యూని ముగించారు.