తైవాన్ పీక నొక్కుతున్న డ్రాగన్.. మరో యుద్ధం తప్పదా?

ఇక తైవాన్ నుంచి ఎప్పుడు తేడా వచ్చినా తన వాయు, నౌకా బలగాలను మోహరించి బల ప్రదర్శనకు దిగుతుంది.

Update: 2024-05-23 11:57 GMT

వన్ చైనా.. (ఒకటే చైనా) నినాదంతో ఊగిపోయే డ్రాగన్ తాను ఎంతటి దారుణానికైనా ఒడిగడతానని స్పష్టం చేస్తుంటుంది. ఆ ద్వీపం వైపు కన్నెత్తి చూసిన ఏ దేశాన్ని అయినా వదలదు. రెండేళ్ల కిందట అమెరికా టాప్ 4 లీడర్ అయిన నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు రాగా డ్రాగన్ నానా హడావుడి చేసింది. ఇక తైవాన్ నుంచి ఎప్పుడు తేడా వచ్చినా తన వాయు, నౌకా బలగాలను మోహరించి బల ప్రదర్శనకు దిగుతుంది. తాజాగా తైవాన్ కొత్త అధ్యక్షుడు చేసిన ప్రసంగం డ్రాగన్ తోక తొక్కినట్లైంది.

బుద్ధి మారదు..

తైవాన్ ప్రపంచ చిప్ పరిశ్రమకు రాజధాని అని చెప్పాలి. ఇక్కడి ప్రజలు తాము చైనా సంకెళ్లలో ఉండాలని భావించడం లేదు. కానీ, చైనా మాత్రం తైవాన్ తమదే అంటోంది. పారిశ్రామికంగా ఎంతో ముందంజలో ఉండే ఈ ద్వీపం సొంత దేశంగా మనుగడ సాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రసంగించిన లాయ్‌.. చైనా తమను బెదిరించడం ఆపాలంటూ గట్టిగా హెచ్చరించారు. ఇది చైనాకు కోపం తెప్పించింది. గురువారం తైవాన్‌ చుట్టూ భారీగా సైనిక విన్యాసాలు చేపట్టింది. దీనికి చైనా పెట్టిన పేరు ‘పనిష్మెంట్‌’ కావడం గమనార్హం.

Read more!

ద్వీపాన్ని చుట్టిముట్టి..

తైవాన్‌ చైనాకు అటు చివరన ఉండే ద్వీపం. దీనిని గురువారం పొద్దున్నే చైనా బలగాలు చుట్టుముట్టాయి. నలువైపుల నుంచి విన్యాసాలు మొదలుపెట్టాయి. ఉదయం 7.45సమయానికే తైవాన్ చుట్టూ చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ మిలిటరీ డ్రిల్స్‌ మొదలుపెట్టింది.

వారిది వేర్పాటు వాదం

తైవాన్ దళాలది వేర్పాటువాద ధోరణి అని చైనా నిందిస్తోంది. స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ దళాల వేర్పాటు చర్యలకు శిక్షగానే తాము విన్యాసాలు చేపట్టామని హెచ్చరిస్తోంది. అమెరికాను పరోక్షంగా నిందిస్తూ.. బయటి శక్తుల జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు తమ సమాధానం ఇదేనని పేర్కొంటోంది.

కాగా, చైనా-తైవాన్‌ మధ్యన ఉండే జలసంధితో పాటు తైవాన్ కు మిగిలిన మూడు దిక్కుల్లో చైనా రెండ్రోజులు తమ విన్యాసాలు చేయనుంది. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్‌ దళాలు ఇందులో పాల్గొంటుండడం గమనార్హం. విన్యాసాల్లో భాగంగా లక్ష్యాలపై తమ దాడుల శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి.

తగ్గని తైవాన్..

కాగా, చైనా చర్యల కారణంగా పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలు, క్షిపణులను తైవాన్ సిద్ధం చేసింది. నౌకా దళం, ఆర్మీ యూనిట్లను హై అలర్ట్ లో ఉంచింది. కాగా, చైనా నుంచి ముప్పు ముంచుకొస్తే దేనికీ భయపడం అని కూడా స్పష్టం చేస్తోంది. తైవాన్ శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది చైనాకు మింగుడు పడడం లేదు.

Tags:    

Similar News