ఎలా జరిగిందంటే.. బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-24 11:57 GMT

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోం మంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులతోపాటు గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోం మంత్రి అనిత వెల్లడించారు. ప్రమాదం నుంచి ఇద్దరు డ్రైవర్లు సహా 27 మంది బయటపడ్డారని.. స్వల్ప గాయాలతో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇదే సమయంలో.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు హోంమంత్రి చెప్పారు.

డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు!:

ఈ బస్సు ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయని చెప్పిన హోంమంత్రి అనిత... చనిపోయిన వ్యక్తుల డీఎన్‌ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామని తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పని చేస్తాయని వెల్లడించారు. ఇదే క్రమంలో... ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ విధంగా ఈ ప్రమాదంపై మొత్తం 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సాయం!:

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్‌ రెడ్డి... ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఇదే సమయంలో... ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల ఆర్థికసాయం అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

మరోవైపు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... పీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

డ్రైవర్లిద్దరూ పోలీసుల అదుపులోనే..!:

ఈ సందర్భంగా స్పందించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్.. ప్రమాదం జరిగిన బస్సులోని డ్రైవర్లు ఇద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టినట్లు బస్సు డ్రైవర్‌ చెప్పాడని, అంతకుముందే రోడ్డు ప్రమాదంలో బైక్‌ పడిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాదానికి గల కారాణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని ఎస్పీ వివరించారు.

ఒక్కో బాధితుడిదీ ఒక్కో గాథ!:

ఈ బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం అవ్వగా.. మరికొంతమంది మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి, అద్దాలు బద్దలు కొట్టుకుని కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు! ఈ క్రమంలో పలువురు బాధితులు వారి వారి భయంకర అనుభవాలను, ఆ భయానక క్షణాలను పంచుకున్నారు.

ఇందులో భాగంగా... బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. హఠాత్తుగా లేచి చూడగా పెద్దఎత్తున మంటలు వచ్చాయని.. వెంటనే బస్సు అద్దం పగలగొట్టి బయటకు దూకేశానని.. తనతో పాటు బస్సులో నుంచి మరో ఇద్దరు బయటకు దూకారని.. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు ఆకాశ్‌ ప్రమాదం జరిగిన తీరును వివరించారు.

ఇదే సమయంలో... బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో గందరగోళం ఏర్పడిందని.. చీకట్లో ఏదీ సరిగ్గా కనబడలేదని.. వెనుక వైపు అద్దం నుంచి అతికష్టం మీద దూకానని.. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈయన ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బస్సులో అరుపులు, కేకలు వినిపించాయని.. లేచి చూసే సరికి బస్సు అంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయని.. ప్రయాణికులు అంతా లాస్ట్ సీట్ వైపు వచ్చారని.. పొగలో ఏం కనిపించలేదని.. ఎవరో కిటికీలోంచి నన్ను బయటకు లాగారని.. కళ్ళ ముందే బస్సు తగలబడిపోయిందని.. లోపల ఉన్న ప్రయాణికులు కొందరు సజీవ దహనం అయ్యారని రామారెడ్డి అనే ప్రయాణికుడు వెల్లడించారు.

Tags:    

Similar News