బస్సులో అస్థిపంజరాలు.. కర్నూలు ప్రమాదంలో షాకింగ్ విషయాలు!
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.;
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన.. బస్సును బైక్ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలు షాకింగ్ గా ఉన్నాయి.
అవును... హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయి. ఈ అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది పెద్ద్దలు, ఇద్దరు పిల్లలు సహా 41 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
బస్సులో అస్థిపంజరాలు, మాంసపు ముద్దలు!:
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. తాము పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ఆ సమయంలో బస్సు తగలబడుతుండటం చూసి అక్కడకు వెళ్లినట్లు తెలిపారు.
ఆ సమయంలో అగ్నికి ఆహుతవుతున్న ఆ బస్సులో ప్రయాణికుల అస్థిపంజరాలు, చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయని.. అవి చూసి తట్టుకోలేకపోయామని తెలిపారు. వెంటనే తేరుకుని.. కర్నూలు ఎస్పీకి ఫోన్ చేసినట్లు హైమా రెడ్డి తెలిపారు.
మరోవైపు ఈ బస్సు ప్రమాద తీరును ప్రయాణికుడు ఆకాశ్ వివరించారు. ఇందులో భాగంగా... బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. హఠాత్తుగా లేచి చూసేసరికి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు. దీంతో వెంటనే బస్సు అద్దం పగలగొట్టి బయటకు దూకినట్లు చెప్పారు.
ప్రయాణికులు నిద్రలో ఉండగానే ఘోరం!:
ఈ ఘోర ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ఈ సందర్భంగా... బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని .. వారిలో సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని.. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునేలోపు బస్సు దగ్ధమైందని అన్నారు.
ఈ క్రమంలో... ఆ బస్సు ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని, మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని వివరించిన డీఐజీ.. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని, బైక్ ఢీకొని మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు.. ఇప్పటివరకూ 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు!
కంట్రోల్ రూం నెంబర్లు ఇవే!:
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూం నెంబర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టరేట్ లో: 08518-277305.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059
ఘటనాస్థలి వద్ద: 91211 01061
కర్నూలు పోలీసు స్టేషన్ లో: 91211 01075.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010