మాటలకందని విషాదానికి సాక్ష్యాలు ఆ బస్సులోని ఈ దృశ్యాలు!

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. స్లీపర్ బెర్తుల మధ్య మాంసపు ముద్దలు మిగిలాయి.;

Update: 2025-10-25 06:14 GMT

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి! ఈ ఘోరానికి కారణం ఏదైనా, కారకులెవరైనా.. అమాయక ప్రజల ప్రాణాలు పొగలో కలిసిపోయాయి.. శరీరాలు బూడిదైపోయాయి.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. స్లీపర్ బెర్తుల మధ్య మాంసపు ముద్దలు మిగిలాయి.

అవును... బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు, ఊపిరి సలపనివ్వని పొగ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే కాలిపోయారు. బెర్తుల మధ్య చిక్కుకున్న మృతదేహాలను లాగితే కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

కిటికీ నుంచి సగం బయటకు వచ్చి..!:

ఈ ఘోర అగ్నిప్రమాదం అనంతరం బెర్తుల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు లాగుతుంటే.. ఆ మృతదేహాల శరీర భాగాలు ఎక్కడికక్కడ విడిపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ క్రమంలో బస్సు కిటికీ నుంచి సగభాగం బయటకు వచ్చిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. కిటికీ నుంచి దూకే ప్రయత్నంలో సగం శరీరం బయటకు వచ్చిన తరువాత స్పృహ కోల్పోవడంతో అక్కడే కాలిపోయినట్లు తెలుస్తోంది!

కుమార్తెను గుండెకు హత్తుకొని..!:

ఈ ఘటనలో.. మంటల్లో చిక్కుకున్న సమయంలో అనూష అనే తల్లి తన కుమార్తె మన్వితను ఎలాగైనా కాపాడాలని గుండెలకు హత్తుకుని గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో.. అప్పర్‌ బెర్త్‌ నుంచి కిందకి దిగేసరికే మంటలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో అనూష, తన చేతిలోని కుమార్తెతో సహా కాలిపోయి మాంసపు ముద్దలా మారారు. బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన ఆ దృశ్యం కంటతడి పెట్టించింది!

పోలీసులు వచ్చే లోపే...!:

కర్నూలు లో జరిగిన బస్సు ప్రమాద సమాచారం పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటలకు తెలిసింది. దీంతో.. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే... ప్రమాదం జరిగిన ప్రదేశం కర్నూలుకు 18 కి.మీ దూరంలో ఉండటంతో వారు వెళ్లేసరికే బస్సు చాలావరకు కాలిపోయింది.

మాంసపు ముద్దలు, బూడిద కుప్పలు..!:

బస్సు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా, బూడిద కుప్పల్లా మారిపోయాయి. మృతదేహాన్ని చూసి ఎవరూ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో... కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్‌ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డా.సాయిసుధీర్, డా.బ్రహ్మాజీ, డా.నాగార్జున ఆధ్వర్యంలో ఆరుగురు ఫోరెన్సిక్‌ వైద్యులు, 10 మంది పీజీలు కలిసి డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించారు.

Tags:    

Similar News